పదవ తరగతి పాస్ కాకున్నా సరే
వెయ్యి రూపాయలు ఇచ్చుకో... డాక్టరేట్ పుచ్చుకో...!!
సమాజంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ గౌరవ డాక్టరేట్లు
యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది లేదు... రీసెర్చ్ చేసింది లేదు... థీసిస్ సబ్మిట్ చేసింది లేదు...అయినా పేరు ముందర మాత్రం డాక్టర్
ఇచ్చేవారికి అర్హత లేదు... ఇంగితం, ఇవరం అంతకన్నా లేదు...!!
తీసుకునే వాళ్లకు సోయి లేదు... అదురు, బెదురు అంతకన్నా లేదు...!!!
✍️ డాక్టర్ కృష్ణ బంటు, పీహెచ్డీ & గోల్డ్ మెడలిస్ట్ అవార్డి ఇన్ జర్నలిజం, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
అర్హత లేనప్పటికీ తాము గొప్ప విద్యావేత్తలమని ఫోజులు కొట్టడానికి అనేకమంది తమ పేరు ముందర డాక్టర్ అని తలిగించుకోవడానికి నానా గడ్డి కరుస్తూ, అడ్డదారులు తొక్కుతూ నకిలీ గౌరవ డాక్టరేట్ లను కొనుగోలు చేస్తూ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి విద్యా అర్హత అంటే కనీసం పదో తరగతి కూడా చదవని వారు ఇంటర్, డిగ్రీ, పీజీ అంటే తెలవని వారు తాము ఆయా రంగాలలో చాలా గొప్పవారమనే భ్రమలో ఇటీవల అర్హత లేని అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయా రంగాల వారికి అమ్మకానికి పెట్టిన డాక్టరేట్లను గుండు గుత్తగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవ విషయం ఏమిటంటే ఇచ్చేవారికి తాము అసలు ఏమి ఇస్తున్నాము అన్న ఇవరం, ఇంగిత జ్ఞానం కూడా ఉండకపోవడం శోచనీయం. అలాగే నకిలీ గౌరవ డాక్టరేట్లను పొందే వారికి ఎలాంటి విద్యార్హత లేకపోవడమే కాదు కనీసం అదురు, బెదురు లేకుండా, సిగ్గు శరం వదిలి తాము డాక్టర్ అని అనిపించుకోవడానికి పడుతున్న ఆరాటం చూస్తుంటే నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ప్రవర్తించడం మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా అధికారులుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉద్యోగ విరమణ చేసిన వారు ఇలా వ్యవస్థలో పలుకుబడి కలిగిన పలు వర్గాల వారు డబ్బులు బాగా సంపాదించి ధనవంతులుగా స్థిరపడ్డవారు కూడా డాక్టర్ అనిపించుకోవడానికి ఉవ్విల్లు ఊరడం అంటే విద్యారంగం లో ఏ విధమైన మార్పులు సంభవిస్తాయో, ఇలాంటి అవాంచిత, అనైతిక ధోరణి ఎంత దాక పోతుందో అన్నదానికి సంకేతంగా పరిగణించవచ్చు. వాస్తవానికి నిజమైన యూనివర్సిటీలు ఆయా రంగాలలో నిష్ణాతులైన పలువురు రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఎప్పుడో ఒకసారి సగర్వంగా గౌరవ డాక్టరేట్ అందిస్తున్నాయి. అయితే నేడు ఎక్కడా కూడా మనం వినని యూనివర్సిటీలు హ్యూమన్ యూనివర్సిటీ అని, గ్లోబల్ యూనివర్సిటీ అని, పీస్ యూనివర్సిటీ అని, ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్టు పేరు పెట్టుకోవడం, లేదా తమది ఏదో ఒక పెద్ద సాహితీ సంస్థ అన్నట్టు బిల్డప్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా పేర్లు వారే పెట్టుకొని అసలు లేని యూనివర్సిటీ పేరుమీద ఆకర్షణీయంగా డాక్టరేట్ సర్టిఫికెట్లు ముద్రించి, చట్టానికి వ్యతిరేకంగా, యూనివర్సిటీ అధికారుల మాదిరిగా వేషధారణ చేసుకొని మరీ ఒక ఫంక్షన్ లాగా వేడుక జరిపి, స్టేజీల పైన అందించడం అనేది విడ్డూరంగా మారుతుంది. ఇందుకు గాను ముందుగా సోషల్ మీడియా వేదికగా ఫలానా రోజు ఫలానా వేదిక మీద డాక్టరేట్ల పంపిణీ జరుగుతుందని, అర్హులైన వారు సంబంధిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తారు. తదుపరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి వారి వారి ఆర్థిక స్థాయి ని బట్టి కనీసం వెయ్యి రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు దండుకుని నకిలీ పీహెచ్డీ డాక్టరేట్లు చేతిలో పెడుతున్నారు. చేతిలో నకిలీ డాక్టరేట్ పట్టా అందుకున్న నాటి నుంచి తాము సమాజంలో మేధావులమని, గొప్ప విద్యావేత్తలమని డంకా భజాయించి డోలు వాయించుకుంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తుంటారు.
డాక్టర్ ఇన్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పొందడం అంటే మామూలు మాటలు కాదు
వాస్తవానికి అసలైన అర్హత గల పిహెచ్డి పొంది డాక్టర్ అని పేరు ముందర రాసుకోవాలంటే ఎంతో శ్రమతో, కష్టంతో, మొక్కవోని ధైర్యం, దీక్ష, దక్షత, పట్టుదల, సంకల్పంతో కూడుకున్న పని. ఇందుకుగాను మొదటగా గుర్తింపు కలిగిన యూనివర్సిటీలో పిహెచ్డి సీటు (అడ్మిషన్) సంపాదించాలి. అలా సంపాదించిన పిహెచ్డి ని సకాలంలో పూర్తి చేసేలాగా ప్రణాళిక వేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ తమకు కేటాయించిన గైడ్ (మార్గదర్శకులు) దయాదాక్షిన్యాలు కూడా కలిసి రావాలి. యూనివర్సిటీలలో పీజీలు, ఎంఫిల్ (చాలా యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సులు ఇటీవల తీసి వేసాయి) పూర్తి చేసినప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో ఉండే పీహెచ్డీ సీట్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది. నోటిఫికేషన్ పడగానే ప్రవేశపరీక్ష (ఎంట్రన్స్) రాయాలి. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ల రోస్టర్ పాటిస్తారు. ఎంట్రన్స్ పాస్ అయిన విద్యార్థి క్వాలిఫై అయినప్పటికీ జనరల్ కేటగిరీలో ఓపెన్ లో సీటు రాకపోతే, రిజర్వేషన్ల లో సీటు లేకపోతే అంతే సంగతులు. అన్నీ కలిసి వచ్చినా తాము ఎంచుకున్న రీసెర్చ్ టాపిక్, ప్రజెంటేషన్ కూడా ముఖ్యమే. తదుపరి మెరిట్లో సీటు సంపాదించి అడ్మిషన్ పొందినాక అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు సరైన సమయంలో, సకాలంలో తగినంత స్కాలర్షిప్ రాక, పుస్తకాలు కొనుగోలు చేయలేక, రిఫరెన్స్ పుస్తకాలు దొరకక, గైడ్లు పెడుతున్న కష్టాలను భరిస్తూ తాము ఎంచుకున్న టాపిక్ విషయంలో అనుగుణంగా రీసెర్చ్ మెథడాలజీ ఎంపిక చేసుకొని, అందుకు అనుగుణంగా పరిశోధన గావిస్తూ, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ, రాండం శాంపిల్ సేకరిస్తూ, ప్రశ్నావళి తయారు చేసుకొని తాము ఎంచుకున్న ప్రాంతంలో సర్వే ప్రారంభించి ఇలా పలు అంచెలలో నాలుగైదు సంవత్సరాలపాటు క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ పరిశోధన కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి తమ పరిశోధన ఎంతవరకు వచ్చిందో అప్పుడప్పుడు సెమినార్లు కండక్ట్ చేస్తూ, తమ గైడ్ కు వివరిస్తూ, చివరకు ఎక్స్టర్నల్ గా వచ్చిన వారికి కూడా కంప్యూటర్ ప్రజెంటేషన్ తమ టాపిక్ పై ఇచ్చి, సెమినార్ కు వచ్చిన వారి అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వైవా కంప్లీట్ చేస్తేనే, తాము చేసిన పరిశోధన గ్రంథాలను ఇతర యూనివర్సిటీల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఓకే చేస్తేనే డాక్ట రేట్ ప్రకటిస్తారు. ఈ విధంగా ఒక పీహెచ్డీ పూర్తి కావాలంటే వయసు మీద పడుతున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా, ఉద్యోగ వేటలో మునిగిపోతూ చివరికి జీవితాలను యూనివర్సిటీ విద్యకి అంకితం చేస్తున్న ఎంతోమంది నిరుద్యోగులు తమ కలలు సాకారం గాక ఎన్ని కష్టాలు పడుతున్నారో విద్యా వ్యవస్థతో సంబంధం ఉన్న మేధావులు అందరికీ తెలిసిన విషయమే. ఒక పీహెచ్డీ సాధించడానికి ఎంతో శ్రమ, ఓర్పు, నేర్పు, ప్రతిభ, పట్టుదల, రిజర్వేషన్, గైడ్ క్షమాబిక్షలు, అండదండలు అవసరం కాగా అడ్డంకులు అన్నింటిని అధిగమించి చివరకు పేరు ముందు డాక్టర్ అని రాసుకోవాలంటే జీవితంలో విలువైన సంవత్సరాలను, తిరిగి తీసుకురాలేని, వెలకట్టలేని కాలాన్ని ఎన్నింటినో కోల్పోవాల్సి వస్తుంది.
నకిలీ గౌరవ డాక్టరేట్లపై కొరడా జులిపించేది ఎవరు...?
కేవలం తమకు సంఘంలో పలుకుబడి ఉందని, కేవలం డబ్బు ఉందనే ఒక అహంకార పూరిత వైఖరితో తమకు చదువు రానప్పటికీ, ఇలాంటి డిగ్రీలను ఎన్నింటినైనా కొంటామని ఒక అమాయకత్వపు వెర్రితనంతో డాక్టరేట్లను కొని, పేరు ముందర తగిలించుకొని సంబరపడిపోతున్న సన్నాసుల భరతం పట్టడానికి, నకిలీల ఆట కట్టించడానికి, కొరడా జులిపించి కటకటాలు లెక్కించేలా చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ, యూనివర్సిటీల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, అర్హత లేకుండా పేరు ముందర డాక్టర్ అని పెట్టుకున్న వారిని విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నకిలీ డాక్టరేటుల వ్యవస్థ ఇలాగే కొనసాగితే అర్హత ఉన్నవారు అట్టడుగు వెళ్లి, అర్హత లేని నకిలీ గౌరవ డాక్టరేట్ లు సమాజం నిండా నిండిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా విద్య అంటే డబ్బులు పెట్టి కొనవచ్చని, నీతి, నిజాయితీ, నైతికత,సభ్యత, సంస్కారం అవసరం లేదనే సంకేతాలు సమాజంలో విస్తరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నకిలీల వలన ఒరిజినల్ దెబ్బతిని వ్యవస్థలో విలువలు కూడా పతనం అవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ యూనివర్సిటీ కి వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చుని డబ్బులు వెదజల్లితే పీహెచ్డీ పట్టా ఇంటికి వస్తుందనే రాంగ్ మెసేజ్ సమాజంలో ప్రజ్వ రిల్లే అవకాశం ఉంది. దీంతోపాటు కేవలం నకిలీ డాక్టరేట్లు తీసుకునే వారే కాకుండా అసలు ఇచ్చే వారిని కూడా కటకటాల పాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల దేశంలో నకిలీ డాక్టరేట్లు అందిస్తున్న పలు ఊరు, పేరు లేని యూనివర్సిటీలను, వాటిని నడుపుతున్న యాజమాన్యాలను, నకిలీ డాక్టరేట్లు అందించిన నిర్వాహకులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటనలు జరిగాయి. ఇంకా ఇలా తెలంగాణలో కూడా ఇలాంటి నకిలీ గౌరవ డాక్టరేట్లు అందిస్తున్న వారి ఆటలకు కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డాక్టర్ కావాలంటే శోధించి సాధించాటమే ధీరగుణము గాని, దొడ్డి దారిన, దొంగ చాటుగా గౌరవ డాక్టరేట్లు పొంది అర్హత లేని వ్యక్తులు పేర్ల ముందర తగిలించుకోవడం తగిలించుకున్న వారికే కాదు అలా చూస్తున్న వారికి కూడా ఎబ్బెట్టుగా అనిపించక మానదు. అందుకే ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్వచ్ఛందంగా నకిలీ గౌరవ డాక్టరేట్లు అందిస్తున్న నిర్వాహకులను, డబ్బులు చెల్లించి నకిలీ గౌరవ డాక్టరేట్లు తీసుకుంటున్న నకిలీ విద్యావేత్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.