పంటకుంటలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Aug 25, 2026 - 19:56
 0  30
పంటకుంటలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలి

వన మహోత్సవ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా : 25:- పంట కుంటలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని వన మహోత్సవ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి  గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి దనసరి అనసూయ సీతక్క ఉపాధి హామీ పనులు పంటకుంటల నిర్మాణం మహిళా సంఘాల భవనాల నిర్మాణం నూతన చేయూత పింఛన్ల మంజూరు వన మహోత్సవం తదితర అంశాలపై అన్ని జిల్లాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌రావు హాజరయ్యారు.రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 5.32 కోట్ల మొక్కలు నాటి 86 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతి మొక్కకు క్రమం తప్పకుండా నీరు అందించాలని సూచించారు. మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా రహదారుల వెంట చేపట్టిన మొక్కల పెంపకంలో రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని తెలిపారు. వన మహోత్సవంలో ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు విద్యార్థులు యువతను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం మనుగడ సాధించాలని స్పష్టం చేశారు.ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. పనికి సిద్ధంగా ఉన్న ప్రతి కూలీకి వారి నివాస ప్రాంతానికి సమీపంలోనే పని అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో తగినన్ని పనుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కూలీల సమీకరణ బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టంగా అప్పగించడంతోపాటు ఎన్‌ఎంఎంఎస్‌ విధానంలో కూలీల హాజరు నమోదును ప్రతిరోజూ పర్యవేక్షించాలని తెలిపారు.మంజూరైన పంటకుంటల పనులను వెంటనే ప్రారంభించి ఉపాధి కల్పనతోపాటు నీటి సంరక్షణకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ పనితీరు కనబరుస్తున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశిస్తూ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు పంటకుంటలు ఇతర నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన నీటి సంరక్షణ, జీవనోపాధికి ఉపయోగపడే ఆస్తుల సృష్టి ఏకకాలంలో జరిగేలా ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ రవీందర్ డీపీఓ వెంకయ్య డిప్యూటీ సీఈఓ ఏపీడీ డీపీఎం ప్లాంటేషన్ మేనేజర్ డీఆర్‌పీ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333