నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
మల్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన 48 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
మల్యాల. 18 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడు పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మల్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన 48 నూతన సీసీ కెమెరాలను ఈరోజు ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల రక్షణకు, నేరాల అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు అని. ప్రతి వీధి, ప్రతి మూలలా కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే గుర్తించడం, నిందితులను పట్టుకోవడం చాలా వేగంగా జరుగుతోంది అన్నారు. ఈ మధ్య కాలంలో మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసు లో సీసీ కెమెరాలు నిందితుని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే జగిత్యాల ,మెట్ పల్లి, ధర్మపురి, కోరుట్ల, ఈరోజు మల్యాల లో పెద్ద మొత్తంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వలన దొంగతనాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనల్లో నిందితుల కదలికలు రికార్డ్ అయి పోలీసులు వెంటనే గుర్తించి అరెస్టులు, కోర్టు లో నిందితులకు శిక్షలు పడటం జరిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. ప్రజలు తమ ఇళ్లకు, వ్యాపార సంస్థలకు, అపార్ట్‌మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని సూచించారు. ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్ ఏరియాల్లో కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరం అని తెలిపారు.
కొత్తగా మల్యాల లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలక మండలిని, ప్రజా ప్రతినిధులను ఎస్పీ అభినందించారు.ఇదే స్ఫూర్తితో మల్యాల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ముందుకు రావాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్యాల సీ.ఐ రాజ్ కుమార్,ఎస్.ఐ సందీప్, గ్రామ సర్పంచ్ బోట్ల జయ ప్రసాద్, ఉప సర్పంచ్ కట్కం వినయ్, వార్డ్ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.