దేవాలయ ఈవో చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ కి పిర్యాదు
మునగాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- ఎండోమెంటు పరిధిలో ఉన్న బరఖాత్ గూడెం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాల పాంప్లెట్ లో ప్రోటోకాల్ ప్రకారం పిఎసిఎస్ చైర్మన్ ని గౌరవించకుండా అనర్హత పడిన జడ్పిటిసిని పదవిలో ఉన్నట్టు ప్రచురణ చేయించిన దేవాలయ ఈఓ, చైర్మన్ లపై చర్యలు తీసుకోవాలని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాయిరాల సుమన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు ఒక లేఖలో ఫిర్యాదు చేశారు. బరాఖత్ గూడెం గ్రామంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంటు పరిధిలో ఉందని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు స్వామి వారికి బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. జరిగే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయుట కొరకు ప్రచురించే ప్రచురణ ప్రతులలో దేవాలయ ఈఓ, చైర్మన్ లు ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానితుల పేర్లు ప్రచురించారని, గత 09న మునగాల జడ్పిటిసిగా నల్లపాటి ప్రమీల ఎన్నిక చెల్లదని హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా వారినే జడ్పిటిసిగా ప్రచురణ చేయించారని తెలిపారు. ఈ విషయం పై మాట్లాడటానికి దేవాలయ ఈఓకు ఫోన్ చేసినా గాని స్పందించలేదన్నారు. కావున కావాలనే దేవాలయ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చేయటానికి ప్రయత్నించిన దేవాలయ ఈఓ, చైర్మన్ లపై తగు చర్యలు తీసుకొని ప్రోటోకాల్ ప్రకారం, కోర్టు తీర్పు ప్రకారం జడ్పిటిసి పేరు దేవాలయ కార్యక్రమాలలో ప్రచురించాలని, ఈ విషయంలో సంబంధిత అధికారులను ఆదేశించాలని కలెక్టర్ ను కోరారు. అంతేగాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ రెవిన్యూ పంచాయతీ అధికారులను ఆదేశించాలని, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరారు. ఈ సమస్యను పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా జడ్పీ సీఈవో సురేష్ కు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.