తెలుగు రాష్ట్రాలు వెలిగి పోవాలి!

తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తల్లో ఒక జోష్ తెచ్చారు! ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి! ప్రభుత్వం ఇంకా గాడిన పడలేదు! పరిపాలన అనుభవం లేకపోవడమో లేదా మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద చేపలు అడ్డు పడటమో లేదా కుర్చీ లాగేసి కింద పడేస్తారనే భయమో... ఏది ఏమో కానీ, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో ముందస్తు జోష్ తగ్గింది! డాంబికాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అనుభవం తో చక్రం తిప్పే ప్రయత్నంలో వున్నారు! అక్కడ ఇక్కడ ఖజానా ఖాళీ చేసేశాయి గత ప్రభుత్వాలు! దాంతో ఇరు ముఖ్యమంత్రులు కత్తి మీద సాము చేయాల్సి వస్తోంది! ఇక్కడే అనుభవ అర్హత పైచేయి గా కనిపిస్తోంది! ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచే ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వృద్దాప్య పింఛన్లు, కళాకారులు, దివ్యాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన నాలుగు వేల రూపాయలతో పాటు గత మూడు నెలలు పెంచిన ప్రకారం అదనంగా మూడు వేలు, అంటే అక్షరాలా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇంటికే వచ్చి అందింస్తున్నారు! ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని సాహసం! గొప్ప సంక్షేమం! 68 లక్షల మందికి దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్ల పై చిలుకు! ప్రతి నెలా పెన్షన్ భారం ఇక నుంచి ఇంచుమించు 890 కోట్లు!
ఇవాళ ఉదయం పెనుమాక లో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ చేశారు. ఒక లబ్దిదారుడి ఇంట కూర్చుని క్షేమ సమాచారం అడుగుతూ టీ సేవించారు! ఆ కుటుంబం ఆనందానికి హద్దులు లేవు!
పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరు ముఖ్యమంత్రులు మంచి స్నేహితులు, గురు శిష్యులు అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పైకి చెప్పుకోక పోయినా అంతర్గత సత్సంబంధాలు ఉండనే ఉంటాయి! గతంలో మాదిరిగా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా ఇరు ముఖ్యమంత్రులు కలసి కట్టుగా రెండు రాష్ట్రాలను ప్రగతి పథం లో పరుగులు తీయించాలి! రాష్ట్రాలు విడిపోయినప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలు త్వరితంగా పంచుకుని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే గొప్ప తెలుగు రాష్ట్రాలు అనిపించుకోవాలి! ఒకరి అనుభవ స్ఫూర్తి , ఒకరి యువ రాజకీయ స్ఫూర్తి వెరసి తెలుగు రాష్ట్రాలు రెండూ వెలిగిపోవాలి!