తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 30 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి?- కలెక్టరేట్ : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అన్నారు. గురువారం ఐడిఓసి లోని సమావేశపు మందిరంలో ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా తమ తమ కార్యాలయాల వద్ద నిర్వహించుకోవాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటల వరకు పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించుకుని, జిల్లా అధికారులు అందరూ ఉదయం 9:00గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామచందర్ లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.