డోర్నకల్ గద్వాల రైల్వే లైన్ అలైన్ మెంట్ మార్చండి
- ఎంపీ వద్దిరాజు కు బాధిత రైతుల వినతి

ఖమ్మం, మార్చి, 30:- పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతుల విలువైన వ్యవసాయ భూములకు నష్టం చేకూర్చే డోర్నకల్ - గద్వాల్ రైల్వే అలైన్ మెంట్ మార్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని బాధిత రైతులు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు విజ్ఞప్తి చేశారు. వారంతా శనివారం ఎంపీ నివాసంలో ఆయనను కలుసుకుని సమస్యను వివరించారు. పాపటపల్లి నుంచి జాన్ పాడు వరకు నిర్మించ తలపెట్టిన ఈ అలైన్ మెంట్ రద్దు పరిచి, ప్రత్యామ్నాయంగా.. వయా మోతే మీదుగా జాన్ పాడు కు మార్చాలని కోరారు. ఇప్పటికే మోటమర్రి - జాన్ పాడు డబ్లింగ్ లైన్ మంజూరైనందున, దానిని ఉపయోగించుకుని.. ప్రతిపాదిత జాన్ పాడు - పాపటపల్లి లైన్ ప్రతిపాదన రద్దు పర్చేలా సహకరించాలని రైతులు కోరారు. బాధిత రైతులంతా.. ఎవరికీ నష్టం కలగని రీతిలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ.. సమగ్ర నివేదికతో వస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో బాధిత రైతు ప్రతినిధులు వల్లూరి పట్టాబి రెడ్డి, సయ్యద్ సాదిక్ అలీ, తోట రామారావు, ముత్యం ఉప్పల రావు, గుర్రం రాము, పండరి, రాజు, నల్లపునేని రమణయ్య తదితరులు ఉన్నారు.