డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తే, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు
డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తే, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు: జిల్లా ఎస్పీ నరసింహ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 13వ తేదీ నుండి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ రొడ్డుభద్రత అవగాహన కార్యక్రమాలు.
సూర్యాపేట, 11 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి వాహనదారు తప్పనిసరిగా డిఫెన్స్ డ్రైవింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మన తప్పు కాకపోయినా ఇతరుల తప్పులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా వాహనం నడపడం రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యమని ఇది ప్రతి డ్రైవర్ కలిగి ఉండాలని తెలిపారు. “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలలో భాగంగా గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు మరియు గ్రామ సభలలో డిఫెన్స్ డ్రైవింగ్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని మరియు కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, అందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ కొన్ని ముఖ్యమైన అంశాలు.
వాహనం నడిపేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ముందున్న వాహనంతో సురక్షిత దూరం పాటించాలి.
వేగాన్ని నియంత్రణలో ఉంచాలి.
మద్యం సేవించి వాహనం నడపకూడదు.
మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా డ్రైవింగ్ చేయాలి.
ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.
రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ స్వీయ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు.