చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి ముంపు గ్రామాల ప్రజలకు అత్యవసర ఆర్థిక సహాయం అందించాలి
మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి విన్నవించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి .
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాలోని ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గద్వాల ప్రాంతంలోని చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి గ్రామాల ముంపు ప్రాంతాలు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయాయి. వరదనీరు ఇళ్లల్లోకి చేరుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వీరికి కేటాయించిన పునరావాస కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు వీరికి అత్యవసర సహాయ కింద తక్షణ ఆర్థిక సాయం అందజేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు. ఈ రోజు హైదరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ముంపు గ్రామాల సమస్యలపై మంత్రికి విన్నవించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలతో చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి ప్రాంతాలు పూర్తిగా వరదనీటితో నిండిపోయింది. అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ఆర్ఆర్ సెంటర్ల కు వెళ్లి నివసించడానికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే ముంపు ప్రాంతాల నుంచి ఆర్ ఆర్ సెంటర్ కు వెళుతున్న ప్రజలకు అత్యవసర ఆర్థిక సహాయం చేయాలని కోరారు దీనికి ఇరిగేషన్ మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.