చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం.
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పౌరులు తమ హక్కులు కాపాడుకునేందుకు, అన్ని రకాల వేధింపుల నుంచి బయటపడడానికి ఉన్న వివిధ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన పోస్(ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్)-2013 చట్టంపై సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) నర్సింగరావు తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోస్ చట్టం 2013లో వచ్చినప్పటికీ సమాజంలో నేటికీ మహిళలపై వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల బారిన పడిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పుడే వేధింపులకు పాల్పడిన వారికి శిక్షలు పడి భవిష్యత్తులో ఎవరు కూడా అలాంటి తప్పులు చేయకుండా ఉంటారన్నారు. చట్టం సమర్ధవంతంగా అమలు కావడానికి ఉద్దేశించిన వివిధ కమిటీలను సమర్ధవంతంగా పనిచేసేలా రూపొందించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచించారు.
అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ నైతిక విలువల గురించి నీతులు చెప్పడమే కాదు వాటిని మనం పాటించినప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరూ సంస్కారవంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుందన్నారు. మన ప్రవర్తన, చేసే ప్రతి పని మంచిదై ఉండి భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లలు, యువతకు మనం ఏమైనా మంచి విషయాలు చెప్పినప్పుడు కొందరు వినడం లేదంటే అందుకు గల కారణాలపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కలిగే పరిణామాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించిన వాళ్ళమవుతామని తెలిపారు. మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాలపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోస్ చట్టం కట్టుదిట్టంగా అమలు కావడానికి సహకరించేందుకు ఏర్పాటు చేస్తున్న కమిటీలు నిబద్ధతతో పనిచేస్తూ ముందుకెళ్లాలన్నారు. మహిళలపై లైంగిక వేధింపులను సమూలంగా నిర్మూలించేందుకు కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టరు పిలుపునిచ్చారు.
అనంతరం పోస్ చట్టం - 2013 పై రూపొందించిన గోడ పత్రికలను ముఖ్య అతిధులు పలువురు జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ సునంద, ఇతర జిల్లా అధికారులు, వివిధ మండలాల తహసిల్దార్లు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
...................................................