గురుకుల అడ్మిషన్ కోసం ఓ తల్లి గోడు
గురుకుల అడ్మిషన్ కోసం తల్లి గోడు.. ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు
తిరుమలగిరి 18 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురాగా మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో లాజరు వెల్లడించారు.
వాటిలో మూడు రెవెన్యూ శాఖకు, ఒకటి విద్యాశాఖకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. “నా కొడుకుకు మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించండి సార్” అంటూ ఓ తల్లి విద్యాశాఖ అధికారులను వేడుకోవడం ప్రజావాణిలో భావోద్వేగానికి గురిచేసింది. గురుకులాల ప్రవేశం కోసం తన కుమారుడు కామన్ ఎంట్రెన్స్ పరీక్ష రాసినా ఎక్కడా అడ్మిషన్ సీటు లభించలేదని, తమకు ముగ్గురు పిల్లలు ఉండటంతో ప్రైవేట్ విద్యను భరించే ఆర్థిక స్థోమత లేదని ఆమె వాపోయింది.
తన కుమారుడికి చదువుపై ఉన్న ఆసక్తిని చూసి అడ్మిషన్ కోసం కలెక్టర్, ఎమ్మెల్యేలను పలుమార్లు కలిసి వేడుకున్నానని, బీసీ వెల్ఫేర్ కమిషనర్‌కు సైతం అర్జీ పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని తల్లి తన గోడును అధికారుల ఎదుట వెళ్లబోసుకుంది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన చేయిస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రజాసంఘాల ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీస మౌలిక వసతులు లేకుండానే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణికి వ్యవసాయం, విద్యుత్, వైద్యం, పోలీస్, విద్య, మహిళా శిశు సంక్షేమం, పశువైద్యం, గ్రామీణ నీటిపారుదల తదితర శాఖల మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, డీటీ జాన్ మహ్మద్, ఎంపీఓ భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.