గద్వాల చేనేత బ్రాండ్ ను కాపాడుకోవాలి.
చేనేత కార్మికుల సంక్షేమానికి పథకాల వర్తింపు.
చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు.
బ్యాంకుల ద్వారా కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కృషి.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
గద్వాలలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు.
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో చేనేతకు ప్రసిద్ధి చెందిన జిల్లాగా వేరే ప్రతిష్టలు తీసుకొచ్చిందని.
పట్టు, కాటన్ సమ్మిళితం చేస్తూ గద్వాల చేనేత జరీ చీరలను నేస్తుంటారని, భౌగోళిక గుర్తింపును పొందిన ఈ బ్రాండ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే సంఘాల ప్రతినిధులు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా జియో టాగ్ నెంబర్లను ఇప్పించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా చేనేత వృత్తిలో ఆర్థిక పురోగతి సాధించేలా గద్వాల చేనేత రంగాన్ని పటిష్టం చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక జనాభా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తోందని, స్వాతంత్ర ఉద్యమంలోనూ గాంధీజీ విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. గద్వాల సంస్థానాధీశులు వందేళ్ళ కిందటే ఇక్కడి కొంతమంది చేనేత కళాకారులను బెనారస్ పంపించి వృత్తిలో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ప్రోత్సహించారన్నారు.
అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ నేతన్నకు భరోసా, చేయూత, త్రిప్టు ఫండ్, భీమా, తదితర పథకాలతో ప్రభుత్వం చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాలు బాధ్యతగా పనిచేసి ఇక్కడి కార్మికుల సంక్షేమానికి పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా చేనేత వస్త్రాలు నేయాలని, ఫలితంగా మార్కెటింగ్ అవకాశాలను విస్తృత పరుచుకోవచ్చన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాకు చెందిన చేనేత కార్మికుల రూ.14.23 కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇక్కడి మాస్టర్ వీవర్స్, సహకార సంఘాల ప్రతినిధులు చేనేత కార్మికుల పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు సామాజిక బాధ్యతగా తమ వంతుగా తోడ్పాటును అందించాలని సూచించారు. గద్వాల చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, భవిష్యత్తు తరాలు కూడా చేనేత వ్యాపారాలతో ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే, ఇతర అతిధులు ఇటీవల నూతనంగా ఎన్నికైన జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన చేనేత సహకార సంఘాల అధ్యక్షులను, సీనియర్ చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా రూ.85 లక్షల విలువైన నేతన్న భద్రత చెక్కును కార్మికులకు అందజేశారు. అంతకుముందు గద్వాలలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత దినోత్సవ ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి ఇందిర, పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు, మాస్టర్ వీవర్స్, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.