కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . CITU డిమాండ్ .
జోగులాంబ గద్వాల 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్లంపూర్ మండల కేంద్రంలో సిఐటీయూ మండల కన్వీనర్ ఏమేలమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారితో సమానంగా సక్రమంగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అల్లంపూర్ మున్సిపాలిటీలో గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు ఖాతాలో పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయడం లేదన్నారు.కార్మికులకు నెల నెల సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని, ఇప్పటికీ రెండు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన బట్టలు, సబ్బులు,నూనెలు, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి వారసులకు అవకాశం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని డిమాండ్ చేశారు.ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయకుండా టార్గెట్ల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.వసతి గృహ కార్మికుల ఖాతాలో నెలనెలా సక్రమంగా వేతనాలు, పీఎఫ్ జమ చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్ ల వేతనాలు వారి ఖాతాలో కాకుండా, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల చైర్మన్ లకు అధికారం ఇవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సంవత్సరం మొత్తం విధులు నిర్వహిస్తున్న పాఠశాల సమయానికి మాత్రమే వేతనాలు చెల్లించడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా పోరాటాలు చేస్తున్న కార్మికులను ఇబ్బందుల గురి చేయడం సరైనది కాదన్నారు తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏసేపు, నాయకులు లక్ష్మన్న, వెంకటేష్, నాగేశ్వరమ్మ,గోపాల్, జయరాం, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.