ఒక్కో రచయిత లక్షలాదిమంది పోరాట యోధులతో సమానం
అయితే ఆ రచయిత ప్రజల పక్షాన పోరాడే వాడై ఉండాలి .
పురోగామి ఆలోచనలు లేకుండా కాలయాపనకు రచనలు చేసేవాళ్లు వ్యవస్థకు ద్రోహం చేసినట్లే .
మెరుగైన సమాజానికి రచయితలు కలిసి రాకపోతే చీత్కరించబడతారు.
--వడ్డేపల్లి మల్లేశం
సమాజాన్ని మరింత మెరుగైన స్థానంలో నిలపాలని ఆశించే వాళ్ళు కవులు కళాకారులు రచయితలు ఇది జన సామాన్యంలో ఉన్నటువంటి అభిప్రాయం . అయితే అ0 దుకు భిన్నంగా తిరోగమన విధానం తో ఆలోచించేవాళ్లు, ఉన్న వ్యవస్థ అలాగే ఉండాలని కోరుకునే వాళ్ళు, కూడా రచయితలుగా ఉండడం బాధాకరం .సమాజానికి హితం చే కూర్చడమే సాహిత్యం యొక్క లక్ష్యం అయినప్పుడు ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకుండా తటస్థ వైఖరిని అవలంబించి మొక్కుబడిగా గుర్తింపు కోసం, పాలకుల మెప్పుకోసం, పదవి కోసం డబ్బు కోసం పనిచేసే రచయితలు కూడా లేకపోలేదు.
ఈ పరిస్థితుల్లోనే ఉన్న వాస్తవాలను నిర్మోహమాటంగా మాట్లాడుకోవడంతోపాటు నిజమైన రచయిత ఏ మేరకు ఈ వ్యవస్థకు పని చేయగలడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది .అలాగే రచయిత యొక్క నిజమైనటువంటి వాస్తవ శక్తిని అంచనా వేయాల్సిన బాధ్యత సమాజం పైన ఉన్నది. ప్రజల కడగండ్లు కష్టాలు, కన్నీళ్లు చెమట చుక్కలను చూసి విచారించి, పరిశీలించి, పరిశోధించి, పరిష్కారాలను చూపగలిగిన వాడే రచయిత కానీ అందుకు భిన్నంగా ఆ పరిస్థితులను ఆలోచించకుండా అంచనా వేయకుండా ఆడంబర జీవితం గడిపే వాడు రచయిత అని అనబడడు. సాహిత్యం పరిజ్ఞానం, భాష, పద ప్రయోగం మీద అపారమైన శక్తి ఉన్నప్పటికీ సామాజికస్పృహ లేనప్పుడు అతడు నిజమైనటువంటి కవి రచయిత కాడు కాకపోగా ప్రజలకు ద్రోహిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే రచయితలారా మీరు ఎటువైపు తేల్చుకోండి అని సమాజం ప్రశ్నించినప్పుడు పిలిపిచ్చి నప్పుడు మన ఆలోచనలు స్పష్ట పరచవలసిన వైఖరి మన అందరి పైన ఉన్నది .
నిజమైన రచయిత ప్రజల కష్టసుఖాలను, సమస్యలు పరిష్కారాలను , కన్నీళ్లకు గల కారణాలను, పాలకుల యొక్క దౌస్ట్యాలను , ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మోహమాటంగా విప్పి చెప్పగలడు, ప్రజలకు అర్థం చేయించగలరు. ప్రజల బాటలో నడవగలడు, ప్రజల పక్షాన నిలిచి పోరాడ గలడు . అందుకే ఒక్క రచయిత లక్షలాది మందితో సమానం అని చెప్పక తప్పదు. ఒక ప్రతిపక్షం ప్రజా సంఘం మేధావులు బుద్ధి జీవులు నిర్వహించే పాత్రను ఒక రచయిత బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే తప్పకుండా నిర్వహించగలడు కావాల్సింది నిబద్ధత పోరాటపటిమ ఎవరికి భయపడినటువంటి స్థిరత్వం రచయితకు చాలా అవసరం. చాలామంది రచయితలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని అనుకుంటారు కానీ నిజమైన అర్థంలో ఆలోచించినప్పుడు ప్రజల పక్షాన పని చేస్తున్నారని చెబితే దానికి అర్థం ఉంటుంది. .మార్పును కోరని వాళ్లు, ప్రజా పోరాటాలను ప్రతిఘ టించేవాళ్లు, ప్రశ్నను అడ్డుకునే వాళ్లు, చైతన్యాన్ని తొక్కిపెట్టేవాళ్లు, నిర్బంధం అణచివేత ఆ కృత్యాలతో ఆధిపత్యాన్ని చలాయించాలని కోరుకునేవాళ్లు పాలకులైన పెట్టుబడిదారులైన భూస్వామ్యవర్గమైన దానికి ప్రతిగా నిలబడగలిగిన సత్తా ఉన్నవాళ్లు మాత్రమే నిజమైన రచయితలు కాగలరు .
పురోగమి ఆలోచనలు చాలా అవసరం :-
అందరూ మార్పు కావాలని కోరుకునే వాళ్లే కానీ మార్పులో తిరువగమనం పురోగమనం రెండు రకాల ఉంటుంది అనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది . ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఏదో ఒక రీతిగా కొత్తదనంలోకి చేరుకుంటే చాలు అనుకునే వాళ్ళు మొక్కుబడిగా పరిపాలనను పాలకులను ప్రభుత్వాలను పెట్టుబడిదారులను సమర్థించే వాళ్ళు. కానీ అందుకు భిన్నంగా మరింత మెరుగైన స్థితిలోకి చేరుకోవాలని, అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన లేనటువంటి సమత స్థితిలోకి ఈ వ్యవస్థను తీసుకు వెళ్లడమే మన ప్రధాన కర్తవ్యం అని అనుకునేవాళ్లు పురోగా మి రచయితలు ఆన బడతారు. అయితే వీరికి పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గం, పాలకుల నుండి అనేక నిర్బంధాలు అణిచివేత తప్పదు . అయితే నేమి ప్రజల పక్షాన పని చేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఒక రచయితగా తనకు ఉన్నటువంటి అవగాహన జ్ఞానం సమయస్ఫూర్తి మేధాశక్తి సామాజిక బాధ్యతను ప్రజల కోణంలో ఉపయోగించినప్పుడు దానికి అర్థం పరమార్థం ఉంటుంది . భావములో, భావావేషంలో, భావజాలంలో, బాధల గాధలను ఎదుర్కొంటున్న ప్రజల జీవితాలలో మార్పును కోరుకునే దిశగా ఆలోచించే వాళ్లంతా పురోగమి రచయితలు అనబడతారు.
వాళ్లు మాత్రమే ఒక్క రచయిత లక్షమంది పోరాతవీరులతో సమానం . అదే సందర్భంలో వ్యవస్థ ఇలాగే కొనసాగాలని, మార్పును అంత పెద్దగా ఆశించకుండా మొక్కుబడిగా రచనలు చేస్తూ మెప్పుకోసం పనిచేసే వాళ్లు లక్షలాదిమంది ఒక్క రచయితతో కూడా సమానం కాదు అని తెలుసుకుంటే మంచిది. ఈ పరిస్థితులలో రచయితలను సమాజం మార్పును కోరే ప్రగతి కాముకు లుగా గుర్తించిన సందర్భంలో నీవె టువైపు ఆలోచించుకోమని హెచ్చరించినప్పుడు సోయి లేకుండా, బాధ్యత లేకుండా, నిర్లజ్జగా వ్యవహరిస్తే సమాజంతో చిత్కారాలకు గురికాక తప్పదు. రచయిత కవులు కళాకారులు మేధావులు అనే పాత్ర ఈ సమాజం కొందరికి మాత్రమే కట్టబెట్టడానికి ప్రధాన కారణం వారి మీద ఉన్న గురుతర బాధ్యత, వారికి ఉన్న సామాజిక చింతన, సామాజిక స్ఫూర్తి, అవగాహన .ఆ పాత్రను పోషించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఉంటే పోరాటం చతికిలబడిపోతుంది, ప్రజా వ్యతిరేక విధానం రాజ్యమేలుతుంది, పాలకులు రెచ్చిపోతారు, పెట్టుబడిదారులు కవ్వింపు చర్యలకు పాల్పడతారు,
భూస్వామ్య వర్గం అణచివేతకు పాల్పడుతుంది . ఒకే సమాజంలో బతుకుతున్న ప్రజలందరూ విభిన్న పరిస్థితులలో నిరాశ నిట్టూర్పులతో అసమానతలు అంతరాలతో వివక్షతతో బ్రతకాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ప్రతిఘటించడానికి సమైక్య ఉద్యమాలకు పిలిపిస్తే స్పందించని రచయితల బ్రతుకు, లక్ష్యం, జీవిత బండారం బయటపడుతుంది. మరింత మెరుగైన సమాజాన్ని కోరుకోవడానికి ప్రధాన కారణం సమాజం యొక్క మార్పును కట్టడి చేసి అభివృద్ధికి దూరంగా ప్రజలను అగాధములోకి నెట్టాలని చూసే శక్తుల ను అడ్డుకోవడానికి అనివార్యమైన పరిస్థితుల్లో పోరాటానికి సిద్ధమైనటువంటి వర్గాల యొక్క ప్రతిరూపమే ఈ పోరాట శక్తి .సాంప్రదాయ భావాలను ఛేదించుకుంటూ, ఆటంకాలను అధిగమిస్తూ, పెట్టుబడుదారుల యొక్క ధన దాహాన్ని తృణీకరిస్తూ, పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని పటాపంచలు చేస్తూ, కష్టాలు కన్నీళ్లతో తమ జీవితాలను దిన దిన గండం గా గడుపుతున్నటువంటి ప్రజల పక్షాన పనిచేయడానికి రచయితలు నిరంతరం అన్వేషించాలి. ఆలోచించాలి, తపించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి ,పరిష్కార మార్గాలను వెతకాలి. అందుకు భిన్నంగా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసం ఆశించే రచయితలు కచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అప్పుడు వారిని సమాజం చీత్కరిస్తుంది అవమానిస్తుంది బహిష్కరిస్తుంది కూడా. అంత దుస్థితిని కోరుకోవడం రచయితలకు అవసరమా? అయితే నిజమైన పోరాట యోధులు అయినటువంటి రచయితలకు అనేక రకాలుగా నిర్బంధాలు, అణచివేత, కష్టాలు తప్పకపోవచ్చు , ప్రజల సహకారం అందకపోవచ్చు .కానీ నమ్మిన సిద్ధాంతం కోసం తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సంస్కారాన్ని భుజానికి ఎత్తుకున్న సమరయోధులుగా రచయితలు తమ సామాజిక బాధ్యతను వ్యవస్థలో మార్పు కోసం ఉపయోగించాలి. ప్రత్యర్థులు ఎంత బలవంతులైన ప్రజల మద్దతుతో మేధావులు ప్రజాసంఘాల యొక్క అండదండలతో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలి. శ్రమించడంతోపాటు ఫలితాన్ని కూడా ఆశించాలి ,సమాజాన్ని పరిశీలించాలి, శ్రమను గౌరవించాలి, శ్రమ యొక్క జీవన సౌందర్యాన్ని ఆరాధించాలి. ప్రజా జీవితాలను చిద్రం చేస్తూ వివక్షతకు గురి చేస్తూ సమాజాన్ని రెండు వర్గాలుగా చీలుస్తున్నటువంటి ప్రత్యర్థులైన పాలకులే శత్రువులు. ఆ శత్రు మూకలను చెండాడే క్రమంలో రచయితలు ప్రజల పక్షాన నిలబడాలి. కార్మిక కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, భూమిలేని నిరుపేదలు, రెక్కాడితేకాని డొక్కాడని అభాగ్యులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, దారిద్రరేఖ దిగు వన జీవిస్తున్న సబ్బండ వర్గాల ప్రయోజనం కోసం రచయిత తను ప్రతినిధిగా నిలబడాలి. ఆ క్రమంలో రచయితలకు ఎనలేని గౌరవం దక్కుతుంది .ఒక ప్రజా ప్రతినిధికి లేనటువంటి గౌరవం రచయితకు అందుతుంది అంటే అక్కడ నిజాయితీ, నిబద్ధతయే ముఖ్యం. ఆ నిజాయితీకి కంకణ బద్దలై ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని జారవిడుచుకున్న రచయితలు ప్రజల చేతిలో ప్రజా కోర్టులో నేరస్తులుగా శిక్షించబడతారని గుర్తిస్తే మంచిది. ఎందుకంటే రచయితలు కవులు కళాకారులుగా ఈ సమాజంతో గుర్తించబడినాము కనుక అది మన యొక్క సామాజిక బాధ్యత అని తెలుసుకుంటే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )