ఎండకు దూరమైన యాంత్రిక జీవితంతో  కోల్పోతున్న ఆరోగ్యం, ఆనందం

Aug 22, 2025 - 18:28
 0  11

  బాల బాలికలు,యువత  ముఖ్యంగా విద్యార్థి  లోకం  మార్కులు, ర్యాంకుల పోటీ ప్రపంచంలో  ఒత్తిడితో అనారోగ్యానికి గురి కావడం  చూస్తూ ఊరుకోవడమేనా?
*************
---  వడ్డేపల్లి మల్లేశం 9014206412 
----13...08...2025*******
ప్రకృతిలో లభించే ఎండలో  మనిషి  రెట్టించిన ఉత్సాహంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ  ఎండకు దూరమై,  తరగతి గదులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్ కు,  టీవీలకు పరిమితం కావడం వల్ల  ఎక్కువసేపు కదలకుండా కూర్చుని  పనిచేయడం   తరగతులకు హాజరు కావడం వలన విద్యార్థులు, యువత  అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయమై మేధావులు నిపుణులు  త మ పరిశోధనలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియచేస్తున్నప్పటికీ ఇటు తల్లిదండ్రులు కానీ అటు సమాజం ప్రభుత్వాలు కానీ  ఆలోచించడం లేదు. తద్వారా రేపటి భవిష్యత్తు  అంధకారమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.  ముఖ్యంగా పోటీ ప్రపంచం కావడం వలన  అర్హతలు సాధించడానికి మార్కులు, ర్యాంకులు  తరగతి గదుల్లో  బె o చీలకు అతుక్కునిపోవడం, సూర్యోదయం సూర్యాస్తమయాన్ని కనీసం చూడకుండా  యాంత్రికంగా  జీవితాన్ని గడపడం వలన  ముఖ్యంగా విద్యార్థులు  10, ఇంటర్మీడియట్ దశకు వచ్చేసరికి అనేక రకాల అనర్థాలతో  అనారోగ్యాలతో  సొమ్మసిల్లి పోతున్నారు అనేది విశ్లేషకుల  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. సెల్ ఫోన్లు చేతిలో ఆడడం,  కంప్యూటర్లు టీవీలకు అతుక్కొని పోవడం,  అదే సందర్భంలో మార్కులు ర్యాంకులు సాధించాలనే మానసిక ఒత్తిడి ప్రేరేపణ తల్లిదండ్రులు  ఉపాధ్యాయులది ఎక్కువ కావడం కూడా  యువత విద్యార్థులు ఆందోళనకు గురికాక తప్పడం లేదు. తద్వారా  ఆత్మహత్యలకు కూడా పురికొల్పబడడం అవాంఛనీయం ఆందోళనకరం .పోటీ ప్రపంచంలో విద్యావంతులుగా మేధావులుగా తీర్చిదిద్దబడాలనే ఆశలు తప్పు కాదు.  కానీ దాన్ని సాధించే క్రమంలో ఆచరిస్తున్న విధానాలు మాత్రమే  అశాస్త్రీయంగా, లోప భూయిష్టంగా, ఒత్తిడిని  పెంచేదిగా ఉన్న కారణంగా  రేపటి పౌరులు  మరింత బలహీనులుగా మారడమే  అంతు చిక్కని సమస్య. దానికి పరిష్కారాన్ని వెతుక్కోవడం అంటే తల్లిదండ్రులుగా సమాజంగా ప్రభుత్వాలపరంగా చూసినప్పుడు  కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది  అంటే అతిశయోక్తి కాదు.  మూడు నాలుగు దశాబ్దాలకు పూర్వం  ఇప్పుడున్న స్థాయిలో ఒత్తిడి ఆందోళన కలిగించే పరిస్థితులు లేవు పైగా ఎండలో వానలో చలిలో  ఆరు బయట  ఆటలు, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం,  క్షేత్ర పర్యటనలు, అవసరమైతే సమాజంలోని భిన్న పరిస్థితులకు చేరుకోవడం వలన  భిన్నమైన వాతావరణం భిన్నమైన  పరిస్థితిలోarogyam, ప్రశాంతత అనుకూలించేది. ప్రస్తుతం అలాంటి ఆలోచన విద్యార్థులకు గాని ఉపాధ్యాయులకు కానీ లేదు.  ఈ తప్పుడు విధానాలు విద్యార్థుల యొక్క ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని  తగిన పరిష్కారాన్ని ఆలోచించకపోతే  శారీరక మానసిక వైరుధ్యాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించడాన్ని  వ్యవస్థ సీరియస్గా చూడాలి.
                     తప్పుడు ఆలోచనలు --ఆచరణ వల్ల  ఎదురవుతున్న వైరుధ్యాలు :-
****************
రెగ్యులర్గా ఆటలు లేకపోవడం శారీరక శ్రమ  కు ప్రాధాన్యత లేనందున  బరువు పెరిగే అవకాశం ఉంది తద్వారా ఊబకాయంతో  భవిష్యత్తులో మధుమేహం  వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆటలు వ్యాయామము  పరుగు పందెముల వంటి వాటి వలన  పిల్లలు ఉల్లాసంగా ఆనందంగా  ఉండే అవకాశం, శ్వాస కోశ వ్యవస్థ రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగు కావడం వలన  బరువు నియంత్రణతో పాటు  రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని  సిఫారసు చేస్తున్నారు.
పిల్లలు యువతతో పాటు  సమాజంలోని ఇతర అన్ని వర్గాలు కూడా  విటమిన్-డి  లోపంతో బాధపడుతున్నారని కారణం ఎండ తగలకపోవడమేనని  కంప్యూటర్కు అతుక్కొనిపోవడం  సెల్ఫోన్ వ్యవస్థలో మునిగిపోవడం వలన  ఎముకల బలహీనత ఏర్పడే అవకాశం ఉందని  తద్వారా  అలసట దంత సమస్యలు  రికెట్స్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదనేది  నిపుణుల అభిప్రాయం. ఎక్కువ సమయం కూర్చుని ఉండడం వల్ల  బరువు పెరగడంతో పాటు ఏకాగ్రత లోపించి  మానసిక అస్థిరత పెరిగే ప్రమాదం ఉన్నది. డిజిటల్ స్క్రీన్ ల పైన  బోధనాభ్యసన కార్యక్రమాలలో పాల్గొనడం వలన  కంటిపై ఒత్తిడి పెరిగి చూపు మందగించే అవకాశం కూడా లేకపోలేదు.  విశ్రాంతి లేని  మూస పద్ధతిలో తరగతులు కొనసాగించడం వలన  ఒకే విధంగా కూర్చుని ఉండడంతో  వెన్నెముక మెడ నొప్పులతో పాటు  కండరాల బలహీనత కూడా ఏర్పడే  ప్రమాదం  లేకపోలేదు.  ఎల్ఈడి లైట్ల వెలుగులో  చదువుకోవడం  పనిచేయడం వలన కూడా  కంటి రెటీనా పాడవడంతోపాటు తల  నొప్పి ఏర్పడి  చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం  ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.
       ముగింపు ఎలా?
*******
1)పాఠశాలలో కళాశాలలో బోధనాభ్యసన ప్రక్రియలో ఎల్ఈడీ లైట్లు లేదా డిజిటల్ స్క్రీన్ ల వ్యవస్థను  అనారోగ్యంకు దారి తీయని స్థితిలో  మెరుగుపరచాలి. 2)గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోవడం కంటే  వైవిధ్యమైనటువంటి  రీతిలో తరగతులను నిర్వహిస్తే  మంచిది.  తరగతికి మించిన స్థాయిలో కిలోలకొద్ది బరువులను  మోయడం వలన కూడా వెన్నెముక నడుము  వీపు ఎముకలు  ప్రమాదంలోకి నెట్టబడుతుంటే బరువు తగ్గించే పనిని  ప్రభుత్వాలు నిర్బంధంగా అమలు చేయాలి.                                3) వ్యాయామానికి ఆటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు  మూస పద్ధతి మార్కులు ర్యాంకుల కోసం ఒత్తిడి చేయడాన్ని నివారించాలి. 4)సృజనాత్మకత,  నైపుణ్యాలు,  బావిసవాల్లను అధిగమించే సమర్థతను  పెంపొందించే విధంగా సిలబస్ను తయారు చేయడం ద్వారా  ప్రస్తుతం కొనసాగుతున్న యాంత్రిక అభ్యసనము  లేదా పనుల నుండి కొంత నైనా ఉపశమనం పొందవచ్చు.  తద్వారా రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన దిగా  తయారు చేయడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు పాలకులు  కీలకమైన పాత్రను పోషించడం ముఖ్యం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333