ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ద్రోహం చేసిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి
బెదిరింపులతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఘటనలపై హైకోర్టు చొరవ చూపాలనీ విజ్ఞప్తి. కాలేశ్వరం ప్రాజెక్టు లోపాలపై మాజీ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.
అయినా విచారణ మేరకు నేరస్తులకు శిక్ష తప్పనిసరి.
నిన్న గాక మొన్న టిఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త పొన్నాల లక్ష్మయ్య కూడా ప్రాజెక్టులలో లోపాలు జరుగుతాయి సవరించుకోవాలి, వాటిని ఆసరాగా చూడకూడదు అని చెప్పడం అవివేకం మూర్ఖత్వం కూడా. సుదీర్ఘ చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్థాయికి ఎదిగి అనేక పదవులు పొందిన పొన్నాల లక్ష్మయ్య ప్రజా ద్రోహిగా మిగిలి టిఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాడో ప్రజలకు సమాధానం చెప్పాలి . అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే సూర్యునిపై ఉమ్మి వేయడమే. 91/2 సంవత్సరాల పాటు ప్రజా పోరాటం మేరకు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారం కోసమే పాకులాడి ఎన్నికల కోసం నెలల తరబడి మంత్రులను పరిపాలన మరిచి కుట్రలు చేసినటువంటి ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం ఎక్కడిది ? కలెక్టర్ కార్యాలయాలతో పాటు పార్టీ కార్యాలయాలను ప్రారంభించి అధికార దుర్వినియోగం చేసింది నిజం కాదా! పేద రైతులకు సహాయం చేయవలసింది పోయి రైతుబంధు పేరుతో ఇతర దేశాలలో ఉన్న వాళ్లకు వందల ఎకరాలు ఉన్న వాళ్లకు పండించని పంట భూములకు గుట్టలకు చెట్లకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది నిజం కాదా !?
గుట్టలు ప్రకృతి విధ్వంసాన్ని ఉద్యమ కాలంలో వ్యతిరేకించి అధికారానికి వచ్చిన తర్వాత గుట్టలు యదేచ్చంగా విధ్వంసానికి గురవుతుంటే అనుమతించినది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ! ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని హామీ ఇచ్చి చేయలేదంటే సిగ్గుచేటు కాదా! డబుgల్ బెడ్ రూమ్ ఇండ్లకు అనేక పిట్టకథలు చెప్పి నాసిరకంగా కొన్ని మాత్రమే నిర్మించి పేదలకు ఇచ్చే బదులు డ్రా తీ సి ఆశాస్త్రీయ పద్ధతిని చట్టబద్ధం చేసింది మీరు కాదా? ఇప్పటికీ గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కు సంబంధించి 5000 కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అవినీతి కూపంలో నెట్టి యువతతో ఆడుకున్న చెలగాటం మీది కాదా? పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయని మీ విధానం... ఏ ముఖంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఒక్కసారి మననం చేసుకోవాలి. కాలేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగినప్పటికీ మేధావులు బుద్ధి జీవులు ఇంజనీర్లు అది తప్పిదమని అది అశాస్త్రీయమని ఎలుగెత్తి చాటిన ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం మూర్ఖత్వం అవివేకం బాధ్యతారాహిత్యమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే పూర్తిగా మీ ఓటమి చేరువలో ఉన్నదని గుర్తిస్తే మంచిది. మేధావులు బుద్ధి జీవులు సామాన్య ప్రజలు రైతులు విభిన్న వర్గాలకు చెందిన ప్రజానీకం మీ పరిపాలన లోపభూయిష్టమని, ప్రజా వ్యతిరేకమని, ఎలుగెత్తి చాటి విమర్శించి నిందించి ఓడించినప్పటికీ ఎవరి అండ చూసుకొని ఎగిసిపడుతున్నారు? ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు? యాత్రల పేరుతో ప్రజాధనాన్ని అక్రమంగా సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అవినీతిపై విచారణ జరిపించాలి :-
దశాబ్దాల తరబడి ప్రజల పోరాటం, ఉద్యమకారుల ఆరాటం, ప్రజా సంఘాల యొక్క చైతన్యం, సబ్బండ వర్గాల యొక్క చొరవ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సా కారం చేసింది కానీ ఇందులో టిఆర్ఎస్ పాత్ర నామమాత్రమని గుర్తిస్తే మంచిది. అయినా చనిపోయింది, ఆత్మహత్యలు చేసుకున్నది, బలిదానాలకు పాల్పడినవారిలో మీ కార్యకర్తలు ఒక్కరైనా ఉన్నారా? అలాంటప్పుడు తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకోవడం ఎంత అవివేకం. ప్రజల పోరాటం ద్వారా సాధించిన తెలంగాణకు నాయకత్వం వహించి ,అధికారాన్ని చేజిక్కించుకొని, అక్రమ దందాలకు పాల్పడి, ప్రతి శాసనసభ్యులు కూడా భూకబ్జాలకు పాల్పడి ప్రభుత్వ పక్షాన లక్షలాది ఎకరాల భూములను అమ్ముకొని కారు చౌకగా కట్టబెట్టి ప్రజలకు చేసిన ద్రోహం వృధాగా పోదు . అందుకు తగిన మూల్యం చెల్లించే కాలం దగ్గరలోనే ఉంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఆవుల పెంపకం గొర్ల పెంపకం పంపిణీకి అధికారుల అవినీతికి సంబంధించి రోజురోజుకు అనేక సంఘటనలు అనేక అవినీతి భాగో తాలు వెలుగు చూస్తున్న సందర్భంలో ప్రతి శాసనసభ్యుడు ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విచారణ జరిపించాలి. కార్యకర్త నుండి మాజీ ముఖ్యమంత్రి వరకు విచారణకు ఆదేశించి దోషులను శిక్షించాలి. ప్రతి పైసా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి ప్రభుత్వం వృధాగా ప్రజల సొమ్మును పెట్టుబడిదారుల పక్షాన జమ చేసినటువంటి కోట్లాది రూపాయల పై నిఘా వేసి రాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంపిణీ చేసి సమయోచితంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలి. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి మంత్రులు, శాసనసభ్యులు నాయకులు కార్యకర్తల పైన సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. వారి అవినీతిపైన ఉక్కు పాదం మోపాలి . ప్రభుత్వం వెనుకడుగు వేస్తే , పునరాలోచన చేస్తే, వెనుక ముందు అయితే ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి.
దోషులకు శిక్ష పడడం ఎంత ముఖ్యమో చట్టాన్ని కాపాడడం అంతే ముఖ్యం. అదే సందర్భంలో ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ రకమైనటువంటి వెసులుబాటు కోసం ప్రస్తుతం గత పాలకుల పైన తగిన స్థాయిలో విచారణ జరిపిస్తేనే సాధ్యమవుతుంది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో హెచ్చరించినప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టు పైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తు ఎత్తిపోడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రజల ముంగిట ప్రజాక్షేత్రంలో తప్పును అంగీకరించి ,అవినీతిని ఒప్పుకొని, తలవ0 చి ప్రజల ముందు మోకరిల్ల వలసిందే . దానికి బదులు మీ హయాంలో ప్రాజెక్టులలో అవినీతి జరగలేదా ? పొరపాటు జరిగితే తప్పేంటి .?అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే తగిన శిక్ష ప్రజల చేతిలో అనుభవించక తప్పదు . ఇన్ని తప్పులు పెట్టుకొని చలో మేడిగడ్డ ప్రకటించడం త మ గోతిని తామే తవ్వుకోవడమే. "ప్రజలకు అతీతంగా మాటలకే పరిమితమైతే ఓటమి మరింత చేరువ అవుతుంది" ఇది సామాజిక రాజకీయ సత్యం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల మద్దతు లేకుండా మేధావులు హెచ్చరిస్తున్నా కూడా శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వాన్ని బెదిరిస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది జాగ్రత్త! ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రిని చెప్పుతోని కొట్టాలని చెప్పులు చూపిస్తూ పదేపదే మీడియాలో కనిపించినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఇలాంటి దూషణలు అవివేకము అన్యాయము. నేరాలు శాపనార్థాల పైన న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోకపోతే భవిష్యత్తులో రాజకీయాలు కుళ్ళి కంపుకొట్టే ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రితో సహా ఏ పార్టీలైన ప్రజా సంస్కృతికి భిన్నంగా మాట్లాడితే శిక్షించగలిగే చొరవ న్యాయవ్యవస్థ తీసుకోవాలి. అదే సందర్భంలో అవినీతికి పాల్పడినటువంటి గత పాలకులపై ఉక్కు పాదం మోపడానికి సుమోటోగా స్వీకరించవలసిన బాధ్యత హైకోర్టుకు ఉన్నదని అనేకమంది మేధావులు బుద్ధి జీవులు విజ్ఞప్తి చేస్తున్న వేళ సామాజిక బాధ్యతగా హైకోర్టు ఈ బాధ్యతను తీసుకోవాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే సందర్భంలో మౌలికమైన అంశాలపైన ఆరోపణలు ప్రత్యా రోపణలు చేసుకునే బదులు మేధావుల సమక్షంలో చర్చిస్తే అరాచక రాజకీయ పార్టీలకు కనీసం బుద్ధి జ్ఞానం అయినా వస్తుంది . కాలేశ్వరం ప్రాజెక్టు అశాస్త్రీయమని, అవినీతిమయమని , గత పాలకుల ద్రోహం అని అనేక మంది మేధావులు ఇంజనీర్లు తెలియచేస్తున్నప్పటికీ కూడా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయడం టిఆర్ఎస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధమే. అంతేకాదు ఓటమిని అంగీకరించినట్లే !రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోవాల్సిందే ! ప్రజలకు భిన్నంగా ప్రభుత్వాన్ని కారణాలు లేకుండా శపిస్తూ బాధ్యతను విస్మరించే ఏ రాజకీయ పార్టీకైనా ఈ శిక్ష తప్పనిసరి. మీ రాజకీయాల కోసం కోట్లాది ప్రజానీకాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని బి ఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా తలవంచి తప్పును అంగీకరించి ఓటమిని ఆమోదించి నిర్మాణాత్మక పాత్ర పోషించడం వరకు మాత్రమే పరిమితం కావాలి. అంతకుమించి ఒక్క మాట అదనంగా మాట్లాడినా, అరాచక పద్ధతులకు పాల్పడినా తగిన బుద్ధి ప్రజలే చెబుతారని తెలుసుకుంటే మంచిది. అందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక చెట్లకు కట్టేసి కొడతారనేటువంటి సూచన నిజంగా అమలు జరగక ముందే జాగ్రత్త పడితే మంచిదేమో ! .
---వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట (చౌటపల్లి) తెలంగాణ రాష్ట్రం)