అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందిస్తే కలిగే ప్రయోజనాలు,
రక్తదానం యొక్క ఆవశ్యకత సమాజం అవగతం చేసుకోవాలి.
రక్తానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం , ఇంత అవసరమా ?
అనే భావోద్వేగం కలగక మానదు.రక్తదానం మనందరి సామాజిక బాధ్యత.
-- వడ్డేపల్లి మల్లేశం.
సహజంగా రక్తం శరీర నిర్మాణము , శారీరక ప్రక్రియల అమలులో క్రియాశీలక భూమిక పోషిస్తుంది . అత్యవసరంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తస్రావం తో విలవిలలాడి ప్రాణం పోయినప్పుడు అత్యవసరంగా రక్తముంటే మనిషి బ్రతికేవాడు కదా! అనే ఆలోచన వస్తే కానీ దాని విలువ తెలియదు. ఈ రకమైనటువంటి అవగాహనను సమాజం సొంతం చేసుకొని మనలో నీ బిడీకృతమై నిక్షిప్తమైనటువంటి రక్తాన్ని సందర్భానుసారంగా దానం చేయడం ద్వారా మరో ప్రాణానికి వెలుగునివ్వాల్సిన అవసరం మనందరి పైన ఉన్నది. అయితే ఆరోగ్యవంతుల యొక్క రక్తం మాత్రమే ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవడం అవసరం . అత్యవసర కాలంలో రక్తం ఇచ్చినప్పటికీ మరో ప్రాణాన్ని నిలబెట్టినట్లుగా భావించాలి అంటే రక్త దానం యొక్క ప్రాధాన్యత ఆవశ్యకత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 1990 కంటే ముందు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడం అనే చికిత్స లేదని శాస్త్రీయ అధ్యయనం ద్వారా తెలుస్తున్నది . ఒకవేళ అలాంటి సాహసం చేసినా బ్రతికే వారు కాదని అందుకే దానికి సైదాంతిక శాస్త్రీయ పునాది కోసం అనేక కృషి జరిగినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రామంలోనే భిన్న వ్యక్తులకు వేరువేరుగా రక్తం ఉండడం కారణంగా అది సాధ్యం కాకపోవడాన్ని గమనించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త కార్లు ల్యాండ్ స్టీనర్ 1990 దశకం ప్రాంతంలో గుర్తించి రక్తాన్ని ఏ,బీ,వో గ్రూపులుగా వర్గీకరించడం ఆ తర్వాత ఆ క్రమంలో సేకరించి మార్పిడికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తుంది ఆయన పుట్టినరోజు అయినటువంటి జూన్ 14వ తేదీని
రక్తం యొక్క ఆవశ్యకతను గుర్తించిన అనేక అంతర్జాతీయ సంస్థలు 2004 జూన్ 14వ తేదీ నుండి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ను నిర్వహించడం ద్వారా తమ సామాజిక రాజకీయ చైతన్య చారిత్రక కృషిని ద్విగుణీకృతం చేసినట్లుగా మనం అంగీకరించాలి.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాదిమంది ప్రమాదాల బారిన పడడంతో పాటు వివిధ వ్యాధుల కారణంగా కూడా రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి అత్యవసర స్థితిని గుర్తించినటువంటి అంతర్జాతీయ సంస్థలు రక్తాన్ని సేకరించడం పంపిణీ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రీ సెంట్ సొసైటీస్, అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వంటి సంస్థలు కలిసి తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీన ప్రారంభించడంతో ఈ రక్త దాతల దినోత్సవం ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంవత్సరం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని ప్రాధాన్యత మరింత పెరిగినట్లుగా మనం గ్రహించాలి ప్రతి ఏటా ఒక నినాదంతో కొనసాగుతున్నటువంటి రక్తదాతల దినోత్సవం ఈ ఏడాది" రక్తదాతలకు కృతజ్ఞతలు మరో నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అభినందనలు" అనే థీ0 తో నిర్వహిస్తున్నట్లుగా మనం భావించాలి.
కొన్ని గణాంకాలను అంశాలను పరిశీలిస్తే :-
సామాజిక వైద్యపరమైన అవగాహన విస్తృతంగా పెరిగిన ఈ రోజులలో రక్తదానం గురించి నటువంటి చైతన్యం కూడా బాగా పెరిగినందుకు సంతోషించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలలో గాయపడడం, సర్జరీలు చేయించుకునే వారికి, తల సేమియా, హిమోఫిలి యా, ఎనీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్లకు తరచుగా రక్తం ఎక్కించవలసినటువంటి అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పేద దేశాలలోని చిన్నపిల్లలు ఈ వ్యాధులకు లోనవుతున్నట్లు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ధనిక దేశాలలో అభివృద్ధి పేరుతో కొనసాగుతున్నటువంటి నిర్మాణాలలో భాగంగా ప్రమాదాలు, సర్జరీ, వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యల వల్ల రక్తం యొక్క అవసరం రక్తదానానికి మరింత ప్రాతిపదిక అవుతున్నది . ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పటికీ పేద దేశాలలో పోషకాహార లోపం కారణంగా రక్తo అవసరం అనేది సవాల్గా మారిన నేపథ్యంలో చిన్నపిల్లలు మహిళలకు దాని యొక్క ప్రాధాన్యత మరింత పెరిగింది . అయితే రక్త దానం చేయడం ద్వారా బలహీన పడతామని అనేక వ్యాధులకు గురవుతామని ఇమ్యూనిటీ పవర్ పోతుంది అనేటువంటి అపోహ ఇప్పటికీ లేకపోలేదు. కానీ శాస్త్రీయ అధ్యయనం ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే రక్తం దానం చేయడం వల్ల నిండు ప్రాణాన్ని కాపాడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానివల్ల రక్తము లోపల ఐరన్ స్థాయిలు స్థిరపడతాయని, కొత్త రక్తం ఉత్పత్తికి , రక్తప్రసరణ తీరు మెరుగుపడడానికి, శారీరక నిర్మాణము గుండె సంబంధిత వ్యాధుల ముప్పు రాకుండా అరికడుతుందని, అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా తరచుగా రక్త దానం తోడ్పడుతుందని అంతిమంగా శారీరక మానసిక ఆరోగ్యానికి రక్తదానం చురుకైన చిట్కాగా భావిస్తే తప్పు లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని ఆరోగ్యంగా బలంగా ఉన్నవాళ్లు తమ రక్తాన్ని విస్తృతంగా నిరంతరం దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడడానికి తోడ్పడితే అంతకుమించిన సామాజిక సేవ ఇక వేరే ఉండదు .
రక్తదానం చేయడానికి గల అర్హతలు- రక్తం యొక్క అవసరాలు- గణాంకాలు:-
పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వవచ్చు అనే సాధారణ నియమంతో పాటు 18 నుండి 65 ఏళ్ల మధ్య వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనీస బరువు 45 కిలోలు ఉండాలి అంతకు మించి తక్కువగా ఉంటే ఇవ్వడానికి వీల్లేదు. దగ్గు జలుబు జ్వరం ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఇవ్వకూడదు, రక్త దానం చేసిన వారు రెండు రోజులపాటు నీళ్లు పళ్ళ రసాలు, మజ్జిగ వంటి ద్రవాహారాలు తీసుకోవడం ద్వారా శారీరక శ్రమకు దూరంగా ఉంటే సరిపోతుంది అని నిపుణులు సూచిస్తున్నారు . భారతదేశంలో రక్తానికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు గణాంకాలను అర్థం చేసుకుంటే మన దేశంలో ఏటా అవసరమవుతున్న రక్తం 5 కోట్ల యూనిట్లు కానీ రక్త దాతల నుంచి అందుతున్నది కేవలం 2.5 కోట్ల యూనిట్లు మాత్రమే అంటే ఇంకా భారతదేశంలో రక్తదాతల సంఖ్య భారీగా పెరగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో మన అవసరాలను మనం చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది .ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 11.85 కోట్ల సార్లు రక్తదానాలు జరుగుతున్నట్లు అందులో 40% ధనిక దేశాల నుండే రక్తదానం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రతి రెండు సెకండ్లలో ఒకరికి రక్తం అవసరం పడుతున్నట్లు పేద దేశాలలో ముఖ్యంగా రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే 54 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం . అయితే అదే పేద దేశాలలో రక్తదానం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల అనేక మరణాలు జరుగుతున్నట్టు కూడా గణాంకాలు తెలియజేస్తున్నాయి అంటే రక్త దానానికి సిద్ధపడడం మన ముందున్న తక్షణ కర్తవ్యం గా గుర్తించడం అవసరం. ఇది డబ్బుతో జ్ఞానముతో కొనుగోలు చేసేది , తయారు చేసేది అంతకు కాదు. ఉన్న రక్తాన్ని వ్యక్తులు స్వచ్ఛందంగా దానం చేయడం ద్వారా నిల్వ చేసి గ్రూపుల వారీగా విభజించి అవసరమైనప్పుడు వినియోగించడం ద్వారా మానవ వనరులను కాపాడుకోవడానికి సమాజం యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. తద్వారా రక్తదాతల దినోత్సవం ప్రాధాన్యతను విస్తృతం చేసే బాధ్యత కూడా మనదే.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచ తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)