సీనియర్ న్యాయవాది సుంకరి చంద్రయ్య మృతి బాధాకరం... జస్టిస్ జి చంద్రయ్య
మునగాల 10 జూన్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
హైకోర్టు న్యాయవాది సుంకర చంద్రయ్య మృతి బాధాకరమని మానవ హక్కుల సంఘం మాజీ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని విజయరాఘవపురం గ్రామంలో సుంకర చంద్రయ్య దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది వృత్తిపట్ల అంకితభావంతో నీతి నిజాయితీతో పనిచేసిన గొప్ప వ్యక్తి చంద్రయ్య అన్నారు. పేద వర్గాలకు న్యాయ సహాయాన్ని అందిస్తూ గొప్ప వ్యక్తిగా పేరుపొందారని కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉద్యోగుల సమైక్య అధ్యక్ష, కార్యదర్శులు కన్నల్ శ్రీనివాసరావు, కంకణాల మధు లు మాట్లాడుతూ సొంత గ్రామానికి సేవ చేయాలని ఉద్దేశంతో గ్రామీణ ఉద్యోగుల సమైక్య అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సమైక్య సభ్యులందరికీ చేదోడువాదోడుగా ఉండే వ్యక్తి చంద్రయ్య అని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యంతో ఉండాలని, ఆ భగవంతుడు వారికి ఎల్లవేళలా అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు, సిపిఎం నాయకులు బురి శ్రీరాములు, చంద్రయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, పలువురు పాల్గొన్నారు.