సర్వేను పక్కాగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోని ప్రతి ఇంటిలో సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మండలాల వారిగా ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లలో సర్వే పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలుంటే తహసీల్దార్ లు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.ఎనిమరేటర్లు,సూపర్వైజర్లు పూర్తి బాధ్యతతో తప్పులు దొరలకుండా ప్రతిరోజు లక్ష్యం మేరకు సర్వే నిర్వహించాలన్నారు. రోజువారీగా నిర్వహించిన సర్వే వివరాలను సాయంత్రం ఐదు గంటల తర్వాత అప్డేట్ చేయాలని సూచించారు. గ్రామాలలో ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా సర్వే నిర్వహించేందుకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల ఇళ్లకు తప్పనిసరిగా వెళ్లి సర్వే నిర్వహించాలని అన్నారు. సర్వే నిర్వహణ అనంతరం సేకరించిన డేటాను అప్డేట్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను సమకూర్చుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా సర్వే నిర్వహించడం జరుగుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్ లు, ఎంపీఓ లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.