వీధి రౌడీలు దొంగలని విమర్శించడం సంస్కారమా?
వీధి రౌడీలు దొంగలని విమర్శించడం సంస్కారమా?
రాష్ట్ర అధినేతకే తప్పని ఈ దుర్భాషల క్రమములో సామాన్య ప్రజల సంగతేమిటి?
అధికార ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంతో ప్రజల మౌలిక అంశాలను విస్మరిస్టే తోడుదొంగలే అవుతాయి .
----వడ్డేపల్లి మల్లేశం
ప్రజల సంక్షేమం, అభివృద్ధి ,పాలన ప్రధాన కర్తవ్యాలుగా అధికారంలో కొనసాగుతున్న అధికారపక్షముతో పాటు నిర్మాణాత్మక సూచనల ద్వారా ప్రభుత్వాన్ని మరింత చైతన్యవంతంగా క్రియాశీలకంగా నడిపించడానికి తోడ్పడే ప్రతిపక్షాలు ఎప్పుడైతే తమ దారిని విస్మరిస్తాయో, కర్తవ్యాన్ని మరిచిపోతాయో, బాధ్యతారహితంగా వ్యవహరిస్తాయో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. రాజ్యాంగపరంగా ఆలోచించినప్పుడు ప్రభుత్వాల తో పాటు ప్రతిపక్షాలకు సామాన్య ప్రజలకు పౌరులకు కూడా అనేక కర్తవ్యాలు విధులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది .రాజ్యాంగ పీఠిక లోని న్యాయము, సార్వభౌమాధికారము, సామ్య వాదము, సమానత్వము, స్వేచ్ఛ వంటి మానవీయ హక్కులను ప్రజలకు అందించే క్రమంలో ప్రభుత్వాలు కృషి చేయాలి వాటిని సమున్నతంగా అమలు చేయడానికి ప్రతిపక్షాలు పూను కోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అధికార పక్షాన్ని పనులు చేయనివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతూ కార్యక్రమాలలో అధికార పక్షాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను ప్రధానులను విమర్శించడమే తమ బాధ్యత అన్నట్లు పూనుకుంటున్నటువంటి ప్రతిపక్షాల విధానాన్ని కచ్చితంగా ఖండించవలసింది.
ప్రభుత్వాలు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అనేక సందర్భాలలో ఆకర్షణ పథకాల ప్రవేశపెట్టడంతో పాటు ప్రకటనల ద్వారా తమ గొప్పతనాన్ని చెప్పుకుంటాయి కావచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు నిర్మాణాత్మకమైన సూచనల ద్వారా ప్రభుత్వం యొక్క లోసుగులను లోపాలను ప్రజల దృష్టికి తీసుకురావడం ద్వారా అధికారానికి రావడానికి కృషి చేయాలి కానీ నిందించడమే తమ బాధ్యతగా భావించినటువంటి ప్రతిపక్షాలు ఇటీవలి కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రిని మంత్రులను పార్టీని ఇష్టపూర్తిగా నిందించడం ఆనవాయితీగా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలోనైతే ముఖ్యమంత్రిని వీధి రౌడీ, దొంగ, తెలివితక్కవాడు, చదువు రాని వాడు, సన్నాసి అనే పేర్లతో ప్రతిపక్షo ప్రధానంగా వేదికల ద్వారా నిందించడo మనం స్పష్టంగా చూడవచ్చు .
అంతెందుకు ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఒకరిద్దరూ ప్రతిరోజు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రిని మంత్రులను నిందించడానికి తప్ప నిర్మాణాత్మక సూచనలు చేసిన దాకా లేదు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఉండవచ్చు కానీ ఆ హామీలను అమలు చేసే క్రమములో నిర్మాణాత్మక సూచనలు చేయడంతో పాటు విద్యా వైద్యము సామాజిక న్యాయము ప్రజలకు అందాలి అనేటువంటి ఆలోచన ఏనాడైనా ఈ ప్రతిపక్షం చేసిందా? ఎందుకంటే టిఆర్ఎస్ అధికారంలో కొనసాగినాడు కూడా విద్యకు వైద్యానికి నా మ మాత్రపు నిధులను కేటాయించడం ద్వారా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిన విషయం మనందరికీ తెలుసు. అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకే మూసలోని వి అని తెలిసిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యకు 17% నిధులు కేటాయిస్తే కేసీఆర్ తన పదేళ్ల పాలనలో 7 శాతానికి మించలేదంటే అర్థం చేసుకోవచ్చు. అదే క్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదంటే విద్యా వైద్యం లాంటి మౌలిక విషయాలు మీద విమర్శించాలి కానీ హామీల సంగతేమిటని ఆకర్షణ పథకాల మీదనే పట్టుబడితే ప్రయోజనం లేదు .
ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలి
టిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన సందర్భంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతిపక్షాలను గౌరవిస్తామని, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దళిత బంధు వంటి ఆ నేక రకాల హామీ ఇచ్చి ఏది కూడా అమలు చేయలేదు. ఇక అమలు చేసినటువంటి రైతుబంధు కూడా చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, బజార్లకు, రోడ్లకు, అడవులకు కూడా చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజా ద్రోహం చేసింది నిజం కాదా ? అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం ఎక్కడిది? అయితే నిర్ణీత 5 లేదా 10 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని మిగతా వర్గాలకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని ప్రతిపక్షం ఇప్పటికైనా జ్ఞానోదయంతో అధికార పక్షానికి సూచిస్తే మంచిది. కానీ రైతులకు చెల్లించలేదని ఎగబెట్టినారని ప్రజలను ప్రభుత్వం మీదికి ఎగదోయడానికి పూనుకుంటే అది ఇరువురికి ప్రమాదకరమే.
ఇక అధికారంలో కొనసాగినన్ని రోజులు ఉద్యోగులకు అనేక డీఏలను పెండింగ్లో ఉంచిన విషయం వాస్తవం కాదా? కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి కోట్లాది రూపాయలను వాయిదా వేసింది నిజం కాదా? ఉద్యోగుల రిటైర్మెంట్ ను అనవసరంగా మూడు సంవత్సరాలు పెంచి రిటైన్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తప్పించుకున్నది వాస్తవం కాదా? ఒకవైపు నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉంటే ఉన్న ఉద్యోగులకే మూడు సంవత్సరాల పెంచడం ఏ మేరకు సమంజసం? ఇ న్ని అంశాలు పొరపాట్లు తమలో ఉంచుకొని ప్రస్తుత అధికార పార్టీని విమర్శిస్తే ఇవన్నీ ప్రజలు గుర్తించరా? బిజెపి కాంగ్రెస్ పార్టీలను కూడా టిఆర్ఎస్ అధికారంలో కొనసాగినాడు ఇష్టం ఉన్న రీతిలో నిందించడం, దాడులకు పాల్పడడం , ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల తమ పార్టీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది నిజం కాదా?
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రకంగా వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడిన సందర్భాలు బహు తక్కువ . ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అణిచివేసిన సందర్భాలు చాలా ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను ఇష్టా రీతిలో ఆధిపత్యం చలా యించడానికి బెదిరించడానికి లొంగ తీసుకోవడానికి ప్రతిరోజు ప్రెస్మీట్లో విమర్శించడం అంటే నిర్మాణాత్మక పాత్రను విస్మరించినట్లే! ప్రజా సంక్షేమాన్ని మరిచినట్లే! ముఖ్యమంత్రి కే రక్షణ లేని పరిస్థితిలో ఇక సామాన్య ప్రజలకు ఎక్కడిది అని ఆలోచించుకో వలసి వస్తున్నది. ఇంత బెదిరింపు ధోరణిలో ప్రతిపక్ష పార్టీగా బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్న తీరు విచారకరం. " ఏ రాష్ట్రంలో కూడా ఈ మాదిరిగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మంత్రులను ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా దూషించడం కానీ దొంగలు వీధి రౌడీలు అని బూతు మాటలతో అవమానించడం కానీ లేదు అంటే తెలంగాణకున్న ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చినామనే భ్రమలో ఉన్నటువంటి అహంకారానికి నిదర్శనమా?
అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కేవలం టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కారణం కాదు దాని వెనుక కొన్ని దశాబ్దాల ఉద్యమాలు పోరాటాలు మేధావుల రచనలు సామాజిక చైతన్యం ఉన్నది అనే విషయాన్ని టిఆర్ఎస్ మరిచిపోవద్దు". అందుకే కేసిఆర్ తెలంగాణ జాతిపిత అనే మాటలను టిఆర్ఎస్ ప్రకటించడం అంటే అభ్యంతరకరమే ఎందుకంటే అంతకుముందు అనేకమంది మహానుభావులు తమ జీవితాలను పణంగా పెట్టి దశాబ్దాల తరబడి పోరాడి అమరులైనారు వాళ్ల గురించి ఆలోచించాలి. అంతెందుకు 1200 పైగా అమరులైనటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను కూడా గుర్తించకుండా, తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి కవులు కళాకారులు మేధావులను పట్టించుకోకుండా కేవలం తమ పార్టీ వల్ల తమ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందని ప్రకటించడం సమంజసం కాదు. అది ప్రజలు అంగీకరించరు కూడా. దానికి పార్లమెంటులో మూలం లేదా? పార్లమెంటులో బిల్లును ఆమోదించి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించింది వాస్తవం కాదా? కేంద్ర ప్రకటించకుండానే మనం సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? ఆలోచించాలి ఇక రాష్ట్రంలో భూముల పంపిణీ ఆదాయ పంపిణీ సమానంగా జరిగేలా చూడాలి విద్యా వైద్యం సామాజిక న్యాయం ప్రజలకు అందడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి.
ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రతి వ్యక్తికి గృహ నిర్మాణం అందుబాటులో ఉంచడం , నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ కేవలం కొన్ని ఆకర్షణ పథకాలను మాత్రమే జ్ఞప్తికి చేస్తూ మౌలిక అంశాలను విస్మరిస్తే పేదలను అవమానించినట్లే. పేదరిక నిర్మూలనలో ఉపాధి అవకాశాలను మెరుగు మెరుగుపరచడంలో భూమిలేని వాళ్లకు భూమిని సమకూర్చడంలో టిఆర్ఎస్ హయాంలో కృషి జరగలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తోని ఈ ప్రయత్నాలు చేయించడంలో పూనుకోవాలి. అప్పుడే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది కానీ బూతు పురాణం, లేనిపోని విమర్శలు, అవమానించే మాటలతో కాలయాపన చేస్తే ప్రజలు క్షమించరు .ఇది టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే వర్తించదు కాంగ్రెస్ పార్టీ కూడా తన కర్తవ్యాన్ని విస్మరిస్తే అంతే సంగతులు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )