విద్యార్థినుల్లో భద్రత –జాగృతికి భరోసా సెంటర్ చైతన్య కార్యక్రమం
భద్రత మీ హక్కు... అవగాహన మా బాధ్యత... గద్వాల్ భరోసా సెంటర్...!
జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్ *జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు భరోసా సిబ్బంది గట్టు మండల పోలీస్ స్టేషన్ ఎస్సై శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గట్టు గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం, మనోపాడు గురుకుల, గట్టు గురుకుల పాఠశాల మరియు కళాశాలలో పదవ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థినుల భద్రత, మహిళా రక్షణ, డిజిటల్ చైతన్యం వంటి కీలక అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే శారీరక, మానసిక, ఆన్‌లైన్ ప్రమాదాలపై వివరించి, భరోసా సెంటర్ అందించే చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, వైద్య సహాయం, పోలీసు రక్షణ వంటి సేవలను తెలియజేశారు. ఫోక్సో చట్టంలోని ముఖ్యాంశాలను సులభంగా వివరిస్తూ, లైంగిక దుర్వినియోగం మరియు వేధింపులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
“గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” మధ్య తేడాలను ఉదాహరణలతో వివరించి, అనుచిత ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100 పోలీస్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్లను వినియోగించాలని విద్యార్థులకు గుర్తు చేశారు.
సైబర్ క్రైమ్‌పై ఎస్సై శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు పంచుకోవడం, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం వలన సైబర్ మోసాలు, హరాస్మెంట్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఎస్సై తెలిపారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఆన్‌లైన్‌లో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, సురక్షిత డిజిటల్ అలవాట్లు అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ గౌడ్, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ శివాని, సపోర్ట్ పర్సన్ స్రవంతి, ప్రిన్సిపాల్ శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ అనూష, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
......