బస్సు ఆపమంటే విద్యార్థులపై డ్రైవర్ రుబాబు
కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే మేమేం చేయాలి?
ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ గోనుపాడు
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆవేదన.
గోన్పాడు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆవేదన.
జోగులాంబ గద్వాల 14 జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- నిత్యం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం శాపంగా మారింది. బస్సు ఆపాలని కోరినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ విద్యార్థులపై తీవ్రంగా రుబాబు చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... గద్వాల మండలం గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజు గద్వాల ఆర్టీసి బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు చాలావరకు కళాశాల వద్ద ఆపకుండా వెళ్ళిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, బస్సును ఆపాల్సిందిగా విద్యార్థులు కోరగా బస్సు డ్రైవర్ బండిని నిలపకుండా దురుసుగా ప్రవర్తించాడు. విద్యార్థులు తమ ఇబ్బందులను వివరిస్తూ, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నగా... "కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే మేమేం చేయాలి? మా ఇష్టం వచ్చినట్లే వెళ్తాం" అంటూ డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా సమాధానమివడం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. జరిగిన ఘటన పై గద్వాల ఆర్టీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోవడం లేదని, రవాణ సౌకర్యం లేక విద్యార్థులు చదువులకు ఇబ్బందిగా మారిందని, జిల్లా కలెక్టర్ స్పందించి బస్సు రవాణ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.