రైతులకు మెరుగైన విత్తనాలు అందించేందుకు అధికారులు సీడ్ ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్
జోగులాంబ గద్వాల 28 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల రైతులకు మెరుగైన విత్తనాలు అందించేందుకు అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు,సీడ్ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు.
బుధవారం ఐడీఓసీ సమావేశ హాల్‌లో పత్తి విత్తన ఉత్పత్తిపై వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ కంపెనీలు,సీడ్ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పంట నష్టం లేకుండా, రైతులకు మంచి ఆదాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లాలో పత్తి విత్తనాలే ప్రధాన ఆదాయ మార్గం కావడంతో,సుమారు 30,000 ఎకరాల్లో సాగు కొనసాగుతూ 35,000 నుండి 40,000 మంది రైతులు విత్తన ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. అధికారులు,సీడ్ ఆర్గనైజర్లు,సీడ్ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేసి, రైతులకు మంచి దిగుబడి కలగడానికీ,అందరికి లాభం చేకూరడానికీ కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ ఏడాది విత్తన ఉత్పత్తి సంబంధించి కంపెనీలు తమ కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని సూచించారు.గత సంవత్సరానికి చెందిన మొత్తం విత్తన ఉత్పత్తి వివరాలతో పాటు,ఎంతమంది రైతుల విత్తనాలు GOT పరీక్షలో ఉత్తీర్ణమయ్యిందో,ఎంత పరిమాణం విఫలమైందో వివరించిన జాబితాను సమర్పించాలని స్పష్టంగా ఆదేశించారు.సీడ్ ఉత్పత్తి చేస్తున్న రైతులకు సీడ్ కంపెనీలు సాంకేతిక సహాయం అందించాలన్నారు. ఎండ, భారీ వర్షాలు,తెగుళ్లు, వ్యాధులు వంటి కష్టకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కంపెనీలు క్రమం తప్పకుండా రైతులకు నిపుణుల సహకారంతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పత్తి విత్తనాల సాగులో బాల కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదని,అలాంటి ఘటనలు ఎదురైతే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్,ఏ డి ఎ సంగీతలక్ష్మి, టెక్నికల్ ఏడీఏ రమేష్,మండల వ్యవసాయ శాఖ అధికారులు,సీడ్ కంపెనీల ప్రతినిధులు,సీడ్ ఆర్గనైజర్లు, తదితరులు పాల్గొన్నారు.