మోతే మండలంలో దంపతుల హత్య కేసులో నిందితుడిపై చర్యలు
ప్రధాన నిందితుడు పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ పోలీస్ ఉద్యోగం నుండి డిస్మిస్.
సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను పోలీస్ ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోతే మండల కేంద్రంలోని ఒక వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన భార్యాభర్తల మృతదేహాల ఘటనపై మోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో అత్యంత వేగంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకుని, వారిని రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఈ దారుణ హత్య ఉదంతంలో మోతే పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ షరీఫ్ ప్రధాన నిందితుడిగా తేలడం, అతను ప్రస్తుతం రిమాండ్‌లో ఉండడంతో ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ నరసింహ సదరు కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుండి తొలగిస్తూ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.- కేసులో ఎస్సీ , ఎస్టీ అట్రాసిటి సెక్షన్ లు పెట్టడం జరిగినది.డిఎస్పీ నీ కేసు దర్యాప్తు అధికారిగా నియమించాం. కేసులో త్వరగా తీర్పు రావడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కు పంపుతాం. నేరస్థులకు త్వరగా కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తున్నాం.బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా కంపెంజేశన్ త్వరగా వచ్చేలా చర్యలుతీసుకున్నాం.శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నేరాలకు పాల్పడినా సొంత శాఖకు చెందిన వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ చర్య ద్వారా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.