ఆరోపణలు కాదు?వాస్తవాలను బయటికి తీయండి!
30 -05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావిమండల పరిధిలోని లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్యానంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా, ఇంతవరకు అసలైన దోషులను పట్టుకోలేక పోయిన ప్రస్తుత ప్రభుత్వం మరియు వారి అసమర్థ పాలనపై చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని జెడ్పిటిసి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి హత్య జరిగి నేటికి 8 రోజులు పూర్తి అయినా కూడా ఇంకా దోషులను పట్టుకోలేని అసమర్థ నాయకులు మీడియా ముందు చేతకాని ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి పెద్ద నాయకుడు ఏం కాదు ఒక సామాన్య కార్యకర్త అని మంత్రి జూపల్లి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. నాయకులవే ప్రాణాలా, కార్యకర్తల ప్రాణాలు అంత చులకనగా చూడటం ఆయనికే చెందుతుంది అని, కార్యకర్తలు ఓట్లేస్తేనే గెలిచావన్న సోయి తెచ్చుకోవాలని హితువు పలికారు. విచారణ పేరిట తాత్సారం చేస్తున్నారు తప్ప పురోగతి సాధించడం లేదన్నారు. ఇందులో పెద్ద నాయకుల హస్తం ఉన్నందునే దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే మీది అయినపుడు, యంత్రాంగమే మీ చేతిలో ఉన్నప్పుడు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని ప్రశ్నించారు.
శ్రీధర్ రెడ్డి మీద అనవసర ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే వాటిని నిరూపించి ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. హత్య జరిగి 8 రోజులు పూర్తయినా కూడా విచారణ పూర్తి చేయకుండా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉందని ఆరోపించారు. విచారణ పేరిట బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు తప్ప అసలైన దోషులను పట్టుకోవడం లేదని అన్నారు. శ్రీధర్ రెడ్డి తండ్రి బొడ్డు శేఖర్ రెడ్డి సోమవారం నాడు తన కొడుకుపై చేస్తున్న భూ తగాదాలు మరియు అక్రమ సంబంధాల విషయం గురించి నిరూపిస్తే తన పేరు మీద ఉన్న 30 ఎకరాల ఆస్తిని జూపల్లికి రాసిస్తానని మీడియా ముఖంగా జూపల్లికి సవాల్ విసిరితే ఇంతవరకు ఆ సవాలను స్వీకరించకపోగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాస్తవాలను వెలుగులోకి రానివ్వట్లేదని అన్నారు.
గతంలో జూపల్లి చరిత్ర చూసినట్లయితే కొల్లాపూర్ ప్రాంతంలో ఘర్షణలు కొత్తేమి కాదని, ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయుటకే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఎస్పీ, డిఎస్పి, డిజిపిలకి ఫిర్యాదులు చేసినా దోషులను పట్టుకోవడంలో ఎలాంటి పురోగతి రాలేదన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందనీ అన్నారు. చరిత్రలో హిట్లర్ నియంత పాలన పై ప్రజలు తిరుగుబాటు చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని మరణం చెందారని అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవద్దని అన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇలాంటి దాడులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సామాన్యులకు, ప్రజలకి అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగిస్తే తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలుు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇలాంటి చర్యలను ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీలకు అతీతంగా ఖండించాలని అన్నారు. బొడ్డు శ్రీధర్ రెడ్డి ఎలాంటి మచ్చలేని నాయకుడని అతనిపై ఇప్పటివరకు రక్షకభట నిలయంలో ఒక్క ఫిర్యాదు కూడా లేదని అలాంటి వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం వలన ఆయన ఆత్మ ఘోశిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పిటిసి వెంకటరమణమ్మ, వైస్ ఎంపీపీ పుష్పలతతోపాటు ఉమ్మడి మండల బిఆర్ఎస్ పార్టీ వ్యవహా రాల ఇన్చార్జి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, జయ గౌడ్, తగరం ఉగ్ర నరసింహ, నంది రాజేశ్వర్ రెడ్డి, పరమల ప్రకాష్, వెల్టూరు సర్పంచ్ మద్దిలేటి మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, గూడెం బాలకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.