ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయండి

Aug 29, 2026 - 21:43
 0  1
ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయండి
ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయండి

ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయండి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

సానుకూలంగా స్పందించిన మంత్రి దామోద‌ర‌ రాజనర్సింహా

ములుగు జిల్లా, ఆగస్టు :29 :  ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్దికి నిధులు మంజూరు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌నసరి అనసూయ సీతక్క కోరారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఆమె భేటీ అయ్యారు.ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన వైద్య సిబ్బంది నియామకం ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి సీతక్క వినతిపత్రం అందజేశారు.ఆసుపత్రిలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనుల కోసం అత్యవసరంగా రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఓపీ (ఔట్ పేషెంట్) గదుల నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఆసుపత్రి నిర్వహణ సేవల మెరుగుదలకు 50 మంది ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ వర్కర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రూ.1.20 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క కోరారు. 132 టెక్నికల్ పోస్టులకు గాను ప్రస్తుతం కేవలం 14 మంది ప‌నిచేస్తున్నార‌ని మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు అత్యవసరంగా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
క్రిటికల్ కేర్ బ్లాక్‌లో రోగుల సౌకర్యార్థం అత్యవసరంగా ర్యాంప్ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే 5 నుంచి 10 పడకల సామర్థ్యంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంటి సంబంధిత శస్త్రచికిత్సల కోసం క్రిటికల్ కేర్ బ్లాక్‌లో అధునాతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న‌ ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

ములుగు వంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో తలసీమియా సికిల్ సెల్ అనీమియా హీమోఫీలియా వంటి వ్యాధులు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధులపై ప్రత్యేక అధ్యయనం నిర్ధారణ చికిత్స కోసం ములుగు జిల్లాలో ఒక ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు.
ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కనిపించే ప్రత్యేక ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.ఈ పరిశోధన కేంద్రం ద్వారా ఆదివాసీ గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి దీర్ఘకాలిక వైద్య కార్యాచరణ రూపొందించవచ్చని తెలిపారు.
ములుగు జిల్లా ప్రజలు ముఖ్యంగా మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అన్ని విధాలుగా బలోపేతం చేయాలని మంత్రి సీతక్క కోరారు.మంత్రి సీతక్క వినతిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సీత‌క్క తెలిపారు. సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333