మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్.
మమ్మల్ని మా బడిని వదిలి వెళ్లొద్దుసార్.
మీకు పుణ్యముంటది ప్లీజ్ సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి.
జోగులాంబ గద్వాల 3 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మేము బువ్వతినేటప్పుడు మా కంచంల మీ పేర్లను దిద్దుకుంటాం సార్ రిగిపోయిన పెన్సిల్ ముక్కతో మీ బొమ్మను పుస్తకాల అట్టమీద దిద్దుకున్నాం. కలబంద పొదలమాటున గొర్రెలుగాసే నన్ను బడిలో చేర్చింది మీరే కదా సార్ పత్తిపూల నడుమ వాడిపోయే నా జీవితాన్ని
వెన్నెలోలే వెల్గించింది మీరే కదా సార్. గొడ్డలిపట్టి మొద్దులు నరికిన మా చేతులతో అక్షరాలు దిద్దిస్తిరి మట్టి తట్టలు మోసిన మా నెత్తులమీద
పుస్తకాల సూర్యూలను పొడిపిస్తిరి. సదువంటే తెలియని మా కుటుంబాలలో
సదువుకే వన్నెదెస్తిరి గుడిసె వాట్లకు కొడవండ్లు వేలాడటం చూసిన
మా కండ్లకు కలాలను మొలిపిస్తిరి.తరగతి గదిలో మీ పాఠాలు మాకు బత్కుదీపాలైనయి మధ్యమధ్యలో మీరు పలికే పద్యాలు మా చెవులలో మారుమోగుతున్నయి. మీరు లేని తరగతి గది బంగారం లేని గనిలా మారింది సార్. మీరు కొట్టిన తిట్టిన పుస్తకాలను ముఖానికి అడ్డుపెట్టుకొని నవ్వుకున్నాం
తరగతిలో మొదటి ర్యాంకుకు మీరిచ్చిన చాక్లెట్ పంచిన తీయ్యదనం నా నాలుకమీద అట్లనే ఉంది.
నల్లబల్లమీద మీరు గీసిన
అక్షాంశాల రేఖాంశాల గీతలు చెరపబుద్ది కావట్లేదు
లఘువు గురువుల గుర్తులు
రేఖాంశాల చిత్రాలు
మైటోకాండ్రియా,పరమాణు నిర్మాణం బొమ్మలు
మా మనసుమీద ముద్రించుకున్నాం సర్.
"ఈ మధ్య టీచర్ల బదిలీల వలన సంవత్సరాల తరబడి
పిల్లల మదిలో చెరగని ముద్ర వేసుకొన్న కొంతమంది టీచర్లను పిల్లలు అడ్డుకున్న దృశ్యం చూసి రాసుకున్న కవిత్వం."
మల్దకల్ మండలం నేలపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ శ్రీనివాసులు విఠలాపురానికి బదిలీ కాగా విద్యార్థుల ఆవేదన. బదిలీని వెంటనే నిలిపివేయాలని మాకు మా సారే కావాలని విద్యార్థులు బ్రతిమలాడుతున్నారు. ఇందుకోసం రేపు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిసింది.