భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం సేవే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు
నిరుపేద యువకుడికి పునర్జన్మనిచ్చిన వైద్య బృందం
తెలంగాణ వార్తజూన్ 30 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మడప భాస్కర్ విద్యుత్ షాక్‌కు గురై శరీరంలో సుమారు 60 శాతం వరకు తీవ్ర కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా, సుమారు రూ.20 నుండి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం చికిత్స కోసం తమ పొలాలను కూడా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక చికిత్స కొనసాగించే స్థోమత లేక తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు భద్రాచలం ఎమ్మెల్యే, ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ తెల్లం వెంకటరావు ని ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, రోగిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపట్టారు.
*ఆసుపత్రిలో జనరల్ సర్జన్ అందుబాటులో లేని పరిస్థితుల్లో, స్వయంగా జనరల్ సర్జన్ అయిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు నాలుగు నుంచి ఐదు గంటలపాటు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ బి. దేవరాజ్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ తాటి మల్లేష్, డాక్టర్ నికిత, డాక్టర్ కౌండిన్య, నర్సింగ్ సిబ్బంది, అనస్థీషియా బృందం, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమిష్టిగా కృషి చేసి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసి పేషంటును రక్షించారు.
పేషంట్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి క్లిష్టమైన కేసుకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు గారు స్వయంగా శస్త్రచికిత్స చేయడం అభినందనీయమని, డాక్టర్ తెల్లం వెంకట్రావు ను ప్రశంసించారు.