బైక్ పై ముందు ములుగు ఎస్పి శబరిష్.. వెనుక మంత్రి సీతక్క

హోదాను పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారు మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే హోదాను పక్కనపెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్ ప్రయాణించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించడంతో స్థానికులు జై సీతక్క అంటూ నినాదాలు చేశారు..