బీసీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు కి దరఖాస్తులు

గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్

Aug 20, 2026 - 19:00
 0  1
బీసీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు కి దరఖాస్తులు

జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్రంలోని బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100% సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను, ఒక్కో యూనిట్‌కు రూ.12,000 చొప్పున 100% సబ్సిడీపై అర్హులైన బీసీ మహిళలకు అందజేయనున్నారు. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు మరియు మేరా/మేరు (మేర /మేరు) కమ్యూనిటీకి చెందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలకు మించకూడదు. తెల్ల రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగిన వారికి, కనీస ప్రాథమిక అక్షరాస్యత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం మండలాల వారీగా ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్ కన్వీనర్లుగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారు అనర్హులు. డూప్లికేషన్ లేకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సి జి జి) సహాయంతో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం, ప్రభుత్వ నిబంధనలు మరియు ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తారు. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333