బాలల వాటా తగ్గుతోంది
భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బాలలు, యువత ఉన్న దేశం. దాదాపు 43.6 కోట్ల మంది 0-18 సంవత్సరాల వయస్సు గలవారు దేశ జనాభాలో సుమారు 40 శాతం ఉన్నారు. అయినప్పటికీ, బాలల అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. బడ్జెట్ ఫర్ చిల్డ్రన్ (బి.ఎఫ్.సి) అనేది యూనియన్, రాష్ట్ర బడ్జెట్లలో బాలలకు సంబంధించిన ఖర్చుల విశ్లేషణ చేసే సంస్థ. ‘గత పదేళ్లలో (2015-2025)లో ఈ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. ఇది బాలల అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగిస్తున్నద’ని ఈ సంస్థ హెచ్చరించింది.
గత పదేళ్లలో యూనియన్ బడ్జెట్‌లో బాలల కోసం కేటాయింపులు నామమాత్రంగా పెరిగినప్పటికీ, మొత్తం బడ్జెట్‌లో వాటా తగ్గింది. 2014-15లో మొత్తం ఖర్చులో 4.5 శాతం ఉండగా, 2024-25లో ఇది 2.3 శాతానికి తగ్గింది. 2021-22లో 1.9 శాతం అత్యల్ప స్థాయికి చేరింది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో బాలల ఖర్చు వాటా 2017-18లో 0.41 శాతం నుండి 2024-25లో 0.32 శాతానికి తగ్గింది. 2025-26లో 0.33 శాతం వుండగా 2026-27లో 0.34 శాతానికి స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ఇది దేశ ఆర్థిక వృద్ధి (8-9 శాతం)తో సరిపడా లేదు. రాష్ట్రాల్లో కూడా ఈ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేరళలో ప్రతి బాలుడికి అత్యధిక కేటాయింపు (2018-19లో రూ.18,203) వుండగా, కర్ణాటకలో 50 శాతం పెరుగుదల (2024-25లో రూ.54,617 కోట్లు) వుంది. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా తక్కువ (బీహార్‌లో రూ.4,363 మాత్రమే). దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగుగా కేటాయిస్తున్నాయి. కేరళ బాలల బడ్జెట్ మోడల్ దేశవ్యాప్తంగా అనుసరించదగినది. సమానత్వం, సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ (ఇ.సి.డి) 2020-21 నుండి 2024-25 వరకు యూనియన్ ఖర్చులో సగటు 0.7 శాతం, ప్రతి బాలుడికి రూ.1,993 మాత్రమే.
రంగాల వారీ అసమతుల్యత
విద్యపై, ఆరోగ్యం, రక్షణపై నిర్లక్ష్యం. బాలల ఖర్చు ప్రధానంగా నాలుగు సెక్టార్లలో విభజించబడింది. మొత్తం బాలల ఖర్చులో 75-77 శాతం వాటా విద్యదే. సమగ్ర శిక్షా అభియాన్ రూ.42,100 కోట్లు (2026-27). అయితే, అమలులో అంతరాలున్నాయి.
అభివృద్ధి – పోషణ
సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ 2.0కి రూ.19,635 కోట్లు (2026-27) కేటాయించారు. డిమాండ్ కంటే 38 శాతం తక్కువ. మొత్తం ఖర్చులో ఆరోగ్యానికి 5 శాతం కంటే తక్కువ. అర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ సగటు 0.7 శాతం. రక్షణ కోసం 1-2 శాతం మాత్రమే. మిషన్ వాత్సల్యంకు రూ.1,550 కోట్లు (2026-27). ఈ విధంగా బడ్జెట్‌లో సమతుల్యత లేకపోవడంతో ఆరోగ్యం, పోషణ, రక్షణ రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
గ్లోబల్ పోలిక
అనేక వెనుకబడిన దేశాల కంటే జిడిపి లో అతి తక్కువగా 0.34 శాతం మాత్రమే మన దేశం కేటాయిస్తోంది. ఒక దేశం తమ పిల్లల అభివృద్ధికి జిడిపి లో కనీసం 5-6 శాతం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒ.ఇ.సి.డి దేశాలు సగటు ఫ్యామిలీ బెనిఫిట్లకు 2.3-2.35 శాతం, ఇ.యు దేశాలు సోషల్ ప్రొటెక్షన్‌కు 1.9 శాతం. డెన్మార్క్, ఫిన్‌లాండ్ వంటి దేశాలు 1 శాతం కేటాయిస్తున్నాయి.
భారత్ పెద్ద జనాభా ఉన్నప్పటికీ ప్రాధాన్యత తక్కువగా ఉండటం వల్ల, తరతరాలుగా పేదరికంలో మగ్గడం, పౌష్టికాహారలోపం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. దీనికి భిన్నంగా సోషలిస్ట్ దేశాలైన క్యూబా ప్రపంచంలోనే అత్యధికంగా జిడిపి లో 9.39 శాతం (2021) విద్యకు కేటాయిస్తోంది. మొత్తం సామాజిక ఖర్చు (ఆరోగ్యం, విద్య, బాలల సంక్షేమం) జిడిపి లో సుమారు 20-25 శాతంగా వుంది. ఉచిత విద్య, ఆరోగ్యం, చైల్డ్ కేర్, మెటర్నిటీ లీవ్ వంటివి బలంగా ఉన్నాయి. శిశు మరణాలు తక్కువ, అక్షరాస్యత 99 శాతం. వియత్నాం విద్యకు 2.9 శాతం (2022) కేటాయిస్తోంది.
మొత్తం సామాజిక ఖర్చు (ఆరోగ్యం, విద్య, కుటుంబ సంక్షేమం) జిడిపి లో 6-8 శాతం మధ్య ఉంటుంది. చైల్డ్ బెనిఫిట్లు, ఉచిత ప్రాథమిక విద్య ఉన్నాయి. చైనా విద్యకు 4.0 శాతం (2022-2023) కేటాయిస్తోంది. మొత్తం సామాజిక ఖర్చు (పెన్షన్లు, ఆరోగ్యం, కుటుంబం) జిడిపి లో 8-10 శాతం మధ్య ఉంటుంది. విద్య-ఆరోగ్యంపై జిడిపి లో ఎక్కువ ఖర్చు చేస్తాయి. సార్వత్రిక సేవల ద్వారా బాలలకు సమాన అవకాశాలు లభిస్తాయి.
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (యు.ఎన్.సి.ఆర్.సి) ప్రకారం, బాలలకు విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, అభివృద్ధి హక్కులు ఉన్నాయి. అయితే, యూనియన్ బడ్జెట్‌లో బాలల వాటా 2014-15లో 4.5 శాతం నుండి 2026-27లో 3.4 శాతానికి తగ్గడం వల్ల ఈ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇది నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ 2016లో నిర్దేశించిన 5 శాతం లక్ష్యానికి దూరమవుతోంది. ఈ తక్కువ కేటాయింపులు సమాజంలో అసమానతలను మరింత పెంచుతున్నాయి, ముఖ్యంగా లింగం, గ్రామీణ-పట్టణ, కులం, ఆర్థిక స్థితి ఆధారంగా.
సవాళ్లు
ప్రభుత్వ ఖర్చు తగ్గడం వలన బిడ్డల సంరక్షణ కోసం డబ్బు ఖర్చు పెట్టగలిగే వారు మాత్రమే నాణ్యమైన బాల్యాన్ని పొందగలుగుతున్నారు. ఇది తీవ్రమైన అసమానతలకు దారితీస్తున్నది. ఇప్పటికే ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న మన దేశంలో, విద్య, ఆరోగ్యం అత్యంత ఖర్చుతో కూడుకున్నవిగా తయారయ్యాయి. దీనితో సమాజంలో విభజన ఏర్పడింది. బాలలు ఓటర్లు కాకపోవటం వల్ల రాజకీయంగా వారికోసం లాబీయింగ్, ఒత్తిడి చేసేవారు లేరు.
అవకాశాలు – సూచనలు
చైల్డ్ బడ్జెటింగ్ యూనిట్లు స్థాపించడం, మల్టీ-సెక్టరల్ ఇన్వెస్ట్‌మెంట్లు, స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్లు అవసరం. గ్లోబల్ మోడల్స్ (కేరళ, సోషలిస్ట్, ఒ.ఇ.సి.డి దేశాలు) నుండి స్ఫూర్తి పొంది ఎర్లీ చైల్డ్ డెవలప్‌మెంట్, రక్షణపై దృష్టి పెట్టాలి. బడ్జెట్ వాటాను 5 శాతానికి పెంచడం, సమతుల్య కేటాయింపులు చేయడం అవసరం. ప్రభుత్వం అనుకుంటే కార్పొరేట్లకి ఇస్తున్న రాయితీలను తగ్గించి బాలల కోసం కేటాయించవచ్చు.
బాలలను ప్రాథమిక ప్రాధాన్యతా రంగంగా చేసుకోవాలి.
గత దశాబ్దంలో బాలల బడ్జెట్ తగ్గుముఖం పట్టడం భారతదేశ జనాభా వృద్ధిని ప్రమాదంలో పడేస్తోంది. తక్కువ కేటాయింపులు బాలల హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, లింగం, గ్రామీణ-పట్టణ, కులం ఆధారిత అసమానతలను మరింత పెంచుతున్నాయి. అయితే, సరైన ప్రాధాన్యతలు, సమతుల్య కేటాయింపులు, రాష్ట్ర-కేంద్ర సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రభుత్వం బాలలను దేశ భవిష్యత్తుగా చూసి, వారి అభివృద్ధికి బలమైన, సమానమైన పెట్టుబడులు పెట్టాలి. ఇది మాత్రమే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు, సమ సమాజ నిర్మాణానికి మార్గం చూపుతుంది.
–డా|| కె. రమాప్రభ
సామాజిక కార్యకర్త
94923 38428