బాల కార్మికులను పనిలో పెట్టుకునేవారిపై కఠిన చర్యలు

Jul 23, 2026 - 20:51
Jul 23, 2026 - 20:54
 0  0
బాల కార్మికులను పనిలో పెట్టుకునేవారిపై కఠిన చర్యలు

జోగులాంబ గద్వాల 23 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–12 కార్యక్రమం పురోగతిని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు సమీక్షించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా నిర్వహించిన 12వ ఆపరేషన్ ముస్కాన్ కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా రెండు ప్రత్యేక పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ బృందాలతో పాటు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖతదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గుర్తించిన బాలబాలికలను షెల్టర్ హోమ్‌లకు తరలిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని, 14 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న వారిని కౌన్సెలింగ్‌కు పిలుస్తామని తెలిపారు. బాలల భవిష్యత్తు పరిరక్షణే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

 ఆపరేషన్ ముస్కాన్–12 లో 2026 జూలై 22 నాటికి జిల్లాలో పురోగతి:  మొత్తం రక్షించిన చిన్నారులు – 85 మంది (బాలురు 81, బాలికలు 4), రాష్ట్రానికి చెందిన పిల్లలు – 67 మంది,  ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు – 18 మంది, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు – 24.  ఈ గణాంకాలు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతూ గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్, డీసీఆర్‌బీ సీఐ టాటా బాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సహదేవుడు, డీడబ్ల్యూఓ శాఖ అధికారి సునంద, డీసీపీఓ శాఖ నుంచి నరసింహనాయుడు, ఆర్డీఓ కార్యాలయం నుంచి డి.టి. విమోచన, డీఈఓ కార్యాలయం నుంచి జీసీడీఓ కర్రెప్ప, డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ జి. రాజు, డీఎల్‌ఓ కార్యాలయం నుంచి సీనియర్ అసిస్టెంట్ అబ్రహం, చైల్డ్ హెల్ప్‌లైన్–1098 కోఆర్డినేటర్ శివలీల, ఆపరేషన్ ముస్కాన్ బృందం ఎస్సైలు ఆర్. శేఖర్, సురేష్, డీసీఆర్‌బీ ఎస్సై సుకూర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State