ప్రాజెక్టులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గద్వాల్:-జిల్లాలోని ప్రాజెక్టులను కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. శనివారం జూరాల ప్రాజెక్టుతో పాటు గుడ్డెందొడ్డి రిజర్వాయర్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్, పంప్ హౌస్ లను సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం ఎంత ఉంటుంది, నీటిని విడుదల చేయు విధానం, ఖరీఫ్ రబీ సీజన్ కు ఆయకట్టుకు నీటి విడుదల చేసే విధానం తదితర వివరాలను ఇంజనీర్లతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు జిల్లా కలెక్టర్కు వివరిస్తూ జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.658 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ 9.481 టీఎంసీ గలదని తెలిపారు.ఆలమట్టి నారాయణపూర్ డ్యామ్ ల నుంచి నీటి విడుదల తర్వాత , ఉన్నత స్థాయి అధికారుల అనుమతితో నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం 10 గేట్లను తెరిచి 41 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని, అలాగే పవర్ జనరేషన్ కోసం 37 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నెట్టంపాడుకు లిఫ్ట్ చేస్తున్న కెనాల్ ను కలెక్టర్ పరిశీలించారు. గూడెం దొడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రిజర్వాయర్ కింద 6 వేల ఎకరాలకు ఆయకట్టు ఉందని, 1.190 టిఎంసి సామర్థ్యం గల రిజర్వాయర్ ద్వారా దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.190 టిఎంసిల నుండి 10 టీఎంసీల వరకు నీటి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటే దాదాపుగా 300 ఎకరాల అవసరం ఉంటుందని, ఎందుకు వేల కోట్ల నిధులు అవసరం పడుతుందని ఇంజనీర్లు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇరిగేషన్ ఇంజనీర్లు ఈ ఈ రహీముద్దీన్, డ్యామ్ ఈ ఈ జుబేర్, డి ఈ ప్రవీణ్ కుమార్ ఇతర ఇరిగేషన్ అధికారులు, ఏఈ లు పాల్గొన్నారు.