ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరగాలి
విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
జోగులాంబ గద్వాల3 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను గురించి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
విద్యాశాఖపై బుధవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలలో వివిధ కోర్సుల వారీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని, వివిధ కొత్త కోర్సులను కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి క్యాంపెయిన్ చేసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలోనే చేర్పించేలా అక్కడ కలిపిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి తాగునీరు, మరుగుదొడ్లు, తదితర కనీస మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఎస్ఎస్సి , ఇంటర్ పాసైన జిల్లా విద్యార్థులు డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరేలా సంబంధిత ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేస్తున్న మౌలిక వసతుల పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఈవో విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి హృదయ రాజ్, తదితరులు పాల్గొన్నారు.