ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న డీఈఓను సస్పెండ్ చేయాలి -ఆవుల నాగరాజు పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు.
సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు విమర్శించారు. నేడు సూర్యాపేట పి.ఎస్. యు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగానే ఫీజులు చెల్లిస్తున్నారని, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, విద్యార్థి సంఘాలు సాధారణంగానే ఆరోపణలు చేస్తుంటాయని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థను పరిరక్షించడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ప్రైవేటు విద్యాసంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే వాటిని అరికట్టడం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. అయితే ప్రజలు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తాననే ధోరణి అవలంబించడం ద్వారా తన రాజ్యాంగబద్ధ బాధ్యతలను విస్మరిస్తున్నారని విమర్శించారు.
సమాజంలో ప్రజలు అనేక సందర్భాల్లో ఉన్నటువంటి పరిమితుల వల్ల అన్యాయాలను భరిస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకుని ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. కానీ సూర్యాపేట డీఈఓ ప్రైవేటు విద్యాసంస్థలపై పర్యవేక్షణ చేయడం, అధిక ఫీజులు, అక్రమ వసూళ్లు, చట్టవిరుద్ధ వ్యాపార పద్ధతులను అరికట్టడం వంటి బాధ్యతలను పక్కనబెట్టి, వాటిని సమర్థించే విధంగా మాట్లాడడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
విద్యార్థి సంఘాలు చేసే ఫిర్యాదులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యలో సమాన అవకాశాల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. అలాంటి ఫిర్యాదులను పరిశీలించకుండా, "విద్యార్థి సంఘాలు జనరల్‌గా మాట్లాడుతుంటాయి" అని వ్యాఖ్యానించడం విద్యార్థి ఉద్యమాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటు పాఠశాలలపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారి, వాటికి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు విరుద్ధం. ఇటువంటి అధికారుల వైఖరి వల్లే ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడి, ప్రైవేటు విద్యా వ్యవస్థ మరింత విస్తరించిందన్నారు.
డీఈఓ వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, ప్రైవేటు విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను వెంటనే సస్పెండ్ చేసి, స్వతంత్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదే సమయంలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లు, పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు, ఇతర అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి, విద్యా చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్.యు రాష్ట్ర నాయకులు ఎం హరీష్, జిల్లా కన్వీనర్ బి కుమార్, నాయకులు మచ్చ వంశీ, మధు పాల్గొన్నారు.