ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం కోసం సురక్షిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి. వెంకటరమణ
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం కోసం సురక్షిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డా,, పెండెం వెంకటరమణ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం,సూర్యాపేట ఆధ్వర్యంలో వాక్ థాన్ (ఆహార భద్రతా ర్యాలీ)ను స్థానిక గాంధీ పార్కు నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా పెండెం వెంకట రమణ, జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి ర్యాలీ ఆహార భద్రత, ఆరోగ్యమే మహాభాగ్యం వంటి నినాదాలతో కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ వరకు సాగింది. ర్యాలీ అనంతరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు అవగాహన సమావేశం నిర్వహించటం జరిగినది. ఈ సందర్భముగా జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా పిండెం వెంకట రమణ తెలిపారు. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ సురక్షిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఆహారం త్వరగా పాడవ్వడం వల్ల జాగ్రత్తలు మరింత అవసరమని సూచించారు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోకుండా వుండాలని, శీతల పానీయాలను తీసుకోకుండా కొబ్బరి బొండాలను తీసుకోవాలని, పాకెట్ల ద్వారా లబించే ఆహారాలు, తినుబండరాలు తినేముందు గడువు తేదీని పరిశీలించ వలసినదిగా సూచించారు.
తదుపరి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రభాకర్ మాట్లాడుతూ తమ యొక్క కార్యక్రమాల గురించి కింది విషయాలు తెలిపారు.
ఆహారం తయారు చేసే ముందు చేతులను శుభ్రంగా కడగాలి.
పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వాడాలి.
పూర్తిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో అమ్మే అస్వచ్ఛమైన ఆహారాన్ని నివారించాలి.
నిల్వ ఉంచిన ఆహారాన్ని సరైన విధంగా భద్రపరచాలి.
శుద్ధమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించాలి.
జిల్లాలోని హూటళ్లు, రెస్టారెంట్లు, ఆహార వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఏదైనా ఆహార సంబంధిత ఫిర్యాదులు ఉంటే సమీప ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి నర్సింహారావు, డిప్యూటీ డిఎంహెచ్వో డా జి. చంద్రశేఖర్, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అద్యక్షులు అన్నం రామకృష్ణా రెడ్డి, కార్యదర్శి పోల నర్సింహారావు, వి సంజీవ్ రెడ్డి, సత్తెయ్య, మత్స్యగిరి, మోతిలాల్, IGK శర్మ, కృష్ణ మూర్తి, ఉమేశ్ రెడ్డి మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు నర్సింగ్ కళాశాలల విద్యార్థినీలు, పారా మెడికల్ కళాశాలల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.