పాలమూరు కు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి
ఉమ్మడి పాలమూరు జిల్లా కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు వరాలు కురిపించారు. ఈ రోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సమస్యలు మరియు జిల్లా ప్రాజెక్టుల పైన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించి, మహిళా సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 3680 మహిళా సంఘాలకు 334 కోట్ల రూపాయల రుణాలను అందించారు. మహిళా సంఘాల వారు తయారు చేసిన పలు ఉత్పత్తులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులతో అభివృద్ధి, జిల్లా ప్రాజెక్టులు, జిల్లా సమస్యలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి శ్రీ జితేందర్ రెడ్డి, ఎంపి శ్రీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ చైర్మన్, మరియు అన్ని శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.