న్యాయస్థానాలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు అసంతృప్తి
: కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకు ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోర్టులకు మీరిచ్చే గౌరవం ఇదేనా’ అంటూ నిలదీసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కారుణ్య నియామకానికి సంబంధించి 2023లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహబూబ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. కోర్టు ధిక్కరణ కింద వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సిన యోగితారాణా హాజరుకాకపోవడంతోపాటు హాజరు మినహాయింపు కోరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నంలోగా హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో నిజామాబాద్‌లో ఉన్న యోగితా రాణా మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో హాజరై సమాచారలోపం కారణంగా ఇది జరిగిందని, బేషరతు క్షమాపణ కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ ‘నోటీసు అందిన తర్వాత న్యాయవాది అయినా రావాలి కదా’ అని ప్రశ్నించారు. ‘గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేశారా’ అన్న ప్రశ్నకు అధికారిణి సమాధానమిస్తూ కలెక్టర్‌కు సూచనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘మీ దగ్గర పెండింగ్ ఉందని కలెక్టర్, కలెక్టర్ వద్ద పెండింగ్ ఉందంటూ మీరు పిటిషనర్ జీవితంతో ఆడుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించించారు. కోర్టు ఆదేశాల అమలుతోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరు మినహాయింపునిచ్చారు.