నిరుద్యోగ యువతకు రుణాలు అందించాలి: ఎంపీ మల్లు రవి
జోగులాంబ గద్వాల 7 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు,జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తో కలిసి నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వము నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్వయం ఉపాధి కొరకు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు రుణాలను మంజూరు చేసి వారికి ఉపాధికి కల్పించేందుకు బ్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కింద రుణాలను మంజూరు చేయాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న పథకాలను గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. బ్యాంకు ఉన్నత అధికారులు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గంలో రుణమేళాలు నిర్వహించి ఎక్కువ మందికి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు సమీపిస్తున్నందున లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంక్ ప్రతినిధులు ప్రత్యెక చొరవ తీసుకొని వివిధ పథకాల క్రింద కేటాయించిన యూనిట్లు మంజూరు అయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని యూనిట్లు మంజూరు అయ్యాయి, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలోని బ్యాంకులు అవసరమైన రుణాలు అందచేస్తున్నాయా? లేదా? అనే విషయాలను లీడ్ బ్యాంకు మేనేజర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లాలో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, పిఎం ఈజిపి, పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి, ఎస్ఎంఈ పథకాల ద్వారా ఉపాధి కల్పించే విధంగా యువతకు విరివిగా రుణాలను అందించాలన్నారు. అర్హులైన వారికి రుణాలు అందించి వారికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈనెల 21న వనపర్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా వృత్తి నైపుణ్యం, రుణ మేళా, జాబ్ మేళాలు నిర్వహించి స్వయం ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రుణాలకు సంబంధించి గ్రౌండ్ చేసిన రుణాలకు బ్యాంకుర్లు వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్షాల మేరకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న పథకాలపై శాఖల వారిగా సమీక్షించారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ, వైద్యశాఖ, విద్యాశాఖ, జిల్లా శిశు సంక్షేమ శాఖ, మిషన్ భగీరథ, ఎస్సీ ఎస్టీ బీసీ శాఖలు, పంచాయతీ శాఖ, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, తదితర శాఖలు అమలు చేస్తున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యా శాఖలో మధ్యాహ్న భోజనం, పాఠశాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఫుడ్ పాయిజన్ జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించాలన్నారు. మిషన్ భగీరథ నీటిని అన్ని పాఠశాలకు అందించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా అధికారులు విశేష కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ,
నర్సింగరావు, డి సి సి బి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవులు,మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత, జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లు, కౌన్సిలర్లు దిశ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు