జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు కలెక్టర్.
జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలో త్రాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ సక్రమంగా నిర్వహిస్తే ఎటువంటి త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కావని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజు త్రాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సజావుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు ఏమైనా లికేజిలు , మరమత్తులు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రూపొందించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను వినియోగించుకుంటూ గ్రామ స్థాయిలో రానున్న రెండు నెలలకు త్రాగునీటి సరఫరా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పట్టణాలలో, గ్రామాలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాలని , ట్యాంకుల నుంచి నల్లాలకు నీటిని సరఫరా చేసే క్రమంలో ఎక్కడ పైప్ లైన్స్ లీకేజీ కాకుండా, వాల్వుల వద్ద సమస్యలు తలెత్తకుండా తరచుగా అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ వేసవిలో ఎక్కడ నీరు వృధా కాకుండా ప్రజలకు అధికారులు తెలియజేయాలన్నారు. ఈ విషయంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.