చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: భట్టి
హైదరాబాద్: ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, తాము వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలు చెప్పడం బిఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని భట్టి చురకలంటించారు. 15 రోజులు ముందుగానే ధాన్యం కొంటున్నామని, గతంలో కంటే ఎక్కువగా 7215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని, చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా, నిశ్చింతగా ఉండాలని భట్టి స్పష్టం చేశారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని, వర్షసూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు.