గూడ్స్ వాహనాల్లో గొర్రెల మందల్లా కూలీలు: పట్టించుకోని ఆర్టిఏ అధికారులు!

Jun 27, 2026 - 14:45
Jun 27, 2026 - 14:46
 0  6
గూడ్స్ వాహనాల్లో గొర్రెల మందల్లా కూలీలు: పట్టించుకోని ఆర్టిఏ అధికారులు!

గూడ్స్ వాహనాల్లో గొర్రెల మందల్లా కూలీలు: పట్టించుకోని ఆర్టిఏ అధికారులు!

ప్యాసింజర్ ఆటోలు కావు...సామాన్లు మోసే గూడ్స్ వాహనాలు!

పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా బేఖాతరు

నిత్యం ఒక్కో వాహనంలో సుమారు 50 మంది కూలీల ప్రమాదకర ప్రయాణం

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం 

  జోగులాంబ గద్వాల 27 జూన్ 2020 ఆరు తెలంగాణ వార్త ప్రతినిధి:- మండల కేంద్రం మీదుగా ప్రతీ రోజు కూలీల రవాణా అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం కేవలం సరుకులు మాత్రమే రవాణా చేయాల్సిన గూడ్స్ ఆటోలను, ఇక్కడి డ్రైవర్లు ప్రయాణికుల రవాణాకు వాడుతున్నారు. లాభాల కక్కుర్తితో నిత్యం ఒక్కొక్క గూడ్స్ వాహనంలో సుమారు 50 మందికి పైగా కూలీలను గొర్రెల మందల్లా ఎక్కించి రోడ్లపైకి వదులుతున్నారు. అయినప్పటికీ, రవాణా శాఖ ( ఆర్టిఏ) అధికారులు మాత్రం ఈ దారుణాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రం గుండా ప్రతిరోజూ ఇన్ని వాహనాలు ఇంత ప్రమాదకరంగా వెళ్తున్నా, ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రాణాలు గాల్లోనే..

గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులకు ఎలాంటి రక్షణ ఉండదు. కనీసం కూర్చోవడానికి సీట్లు కూడా లేని ఆ వాహనాల్లో, కూలీలు ఒకరినొకరు పట్టుకుని నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్డుపై వాహనం కొద్దిగా అదుపు తప్పినా ఊచకోత కోసినట్లు కూలీల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే ఆర్టిఏ, మరియు స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ గూడ్స్ ఆటోల అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State