ఏపీకి వెళ్లరా? ప్రజలకు సేవ చేయరా? ఐఏఎస్‌లపై క్యాట్ ఆగ్రహం!
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన నలుగురు ఐఏఎస్ అధికారులపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోనే కొనసాగాలని కోరుతూ ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన అనే ఐఏఎస్‌లు నిన్న క్యాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన క్యాట్.. "ఏపీలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. వారికి సేవ చేయడానికి మీకు ఇష్టం లేదా?" అంటూ ఐఏఎస్‌లను ప్రశ్నించింది. డీవోపీటీకి ఐఏఎస్‌ల కేటాయింపులపై పూర్తి అధికారం ఉందని, బదిలీలను అడ్డుకునేందుకు క్యాట్ జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఐఏఎస్‌లు చేసిన విజ్ఞప్తిని క్యాట్ తోసిపుచ్చింది. నిన్నటి వరకు తెలంగాణలోనే ఉండాలని పట్టుబట్టిన ఐఏఎస్‌లు.. క్యాట్ చివాట్లు పెట్టడంతో ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మరి!