ఇండో-ఖతార్ (రియల్ ఎస్టేట్ వెంచర్) క్షేత్ర- 2, ధర్మస్థలి లో ప్రజలు ప్లాట్లు కొన్ని మోసపోవద్దు
సామాజిక కార్యకర్త ఎన్.రాములు

ఖమ్మం, 3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- : స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త ఎన్.రాములు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా , కొణిజర్ల మండలము , అమ్మపాలెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు వరుసగా 594, 595, 11, 12, 18, 19,20 నందు చెరువకు వెళ్ళు జాలు గలదు . సదరు జాలును పూర్తిగా మూసివేసి దానిపై రోడ్డు నిర్మించి ప్లాట్లుగా విభజించినారు . నాలాను పూర్తిగా ఆక్రమించినందు వలన గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుచున్నారు . దీనివల్ల రైతుల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి . ఇండో - ఖతార్ ప్రాజెక్టు వారు సర్వే నెం. 7 నందు 3 ఎకరాల 35 కుంటల ఇనామ్ భూమిని ప్రాజెక్టు వారు ప్లాట్లుగా విభజించి అక్రమముగా విక్రయించుచున్నారు . ఇండో- ఖతార్ ప్రాజెక్టువారు అమ్మపాలెం గ్రామములో సర్వే నెంబర్లు వరుసగా 80లో భాగము. 80, 81, 83, 84, 90, 91, 92, 93, 106, 107, 110, 111, 112 లలో 41 ఎకరాల 30 గుంటలకు చెందిన వ్యవసాయ , వ్యవసాయేతర, బండ్లదారులు , పూర్వకాలము నుండి సహజ సిద్ధముగా ఏర్పడిన వర్షపు జలదారులు కలిగి ఉన్నాయి . స్థంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) నుండి అనుమతులు పొందాలంటే ముందుగా జలవనరుల శాఖ , నీటిపారుదల శాఖ నుండి NOC లు తీసుకోవలసి ఉంటుంది . కాని ఇండో- ఖతార్ ప్రాజెక్టు (రియల్ ఎస్టేట్ వెంచర్) నిర్వహకులు జలవనరుల శాఖ , నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు లక్షలాది రూపాయలు లంచాలు ఇచ్చి తప్పుడు NOC లు తీసుకోవడం జరిగింది . మరియు సహాయ సంచాలకులు , జిల్లా సర్వే మరియు భూ రికార్డుల , తప్పుడు లొకేషన్ స్కెచ్లు ఇచ్చి లే అవుట్కు అనుమతులు పొందుటకు అధికారులను తప్పుద్రోవ పట్టించడం జరిగింది . ఇండో-ఖతార్ ప్రాజెక్టు (రియల్ ఎస్టేట్) వారికి కొణిజర్ల మండలము, అమ్మపాలెం గ్రామ పరిధిలో 41 ఎకరాల విస్తరణములో File No. 425801/LP/GP/202452/0025/2024, Dated: 11-08-2024న ప్రాజెక్టుకు సుడా నుండి అక్రమంగా అనుమతులు పొందడం జరిగింది . అంతేగాక ఇండో- ఖతార్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు యాజమాన్యం రేరా అనుమతులు, లేకుండా ఫ్లాట్లు విక్రయించడం జరుగుచున్నది. ప్రిలాంచ్ పేరుతో ప్లాట్ల విక్రయాలు జరుగుచున్నాయి. అంతేగాక డిటిసిపి ఉల్లంఘనలు భారీ స్థాయిలో జరిగాయి. ఇండో ఖతార్ రియల్ ప్రాజెక్టు నందు పలు కోర్టు వివాదాలు, ప్రైవేటు వ్యక్తుల మధ్య పంచాయితీలు, నెలకొని ఉన్నాయి. భవిష్యత్లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని కావున ఎవరు తొందరపడి కొనొద్దని కోరారు .