అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి వెల్లడి
షాద్ నగర్ పోలీసుల అదుపులో "మహారాష్ట్ర గ్యాంగ్"
30 తులాల బంగారం స్వాధీనం
ఇద్దరు గ్యాంగ్ సభ్యుల అరెస్టు - రిమాండ్ కు తరలింపు
షాద్ నగర్, ఆమన్ గల్, కడ్తాల్, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, పహాడి షరీఫ్, మహేశ్వరం, కందుకూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు
షాద్ నగర్ మీడియా సమావేశంలో పోలీసుల వెల్లడి
జోగుళాంబ ప్రతినిధి, షాద్ నగర్:- రహదారులకు సమీపంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్.. ఇంటికి తాళం కనిపించిందో ఇక అంతే సంగతి, పగలంతా రెక్కీలు నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతూ, అదేవిధంగా చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిందంతా దోచుకుంటున్న "మహారాష్ట్ర గ్యాంగ్" ను ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం స్థానిక ఏసిపి రంగస్వామి పర్యవేక్షణలో మీడియా సమావేశం నిర్వహించారు.
మహారాష్ట్ర గ్యాంగ్ చేసిన 23 దొంగతనాలకు సంబంధించిన పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను మీడియా ముందు పెట్టారు. షాద్ నగర్, ఆమన్ గల్, కడ్తాల్, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, పహాడి షరీఫ్, మహేశ్వరం, కందుకూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నిందితులు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు రాజీవ్ శంకర్ పవర్, అదేవిధంగా నాగపూర్ కు చెందిన అజయ్ సర్కస్ పవర్, తుల్జాపూర్ గ్రామానికి చెందిన అమూల్ అలియాస్ షిండే, అలాగే మహారాష్ట్రలోని వైజపూర్ తాలూకా గొల్వడి గ్రామానికి చెందిన పవన్ మచీంద్ర, నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్వాతిలు అంతరాష్ట్ర దొంగల ముఠాగా ఏర్పడి 23 చోరీలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, ఆమన్ గల్, కడ్తాల్, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, పహాడి షరీఫ్, మహేశ్వరం, కందుకూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడగా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు దొంగతనాలు చేయగా, కొత్తూరులో ఒకటి, కడ్తాల్ మండలంలో రెండు, మహేశ్వరం మండలంలో రెండు, కందుకూర్ మండలంలో రెండు, నందిగామ మండలంలో ఒకటి, కేశంపేట పరిధిలో ఒకటి, శంషాబాద్ పరిధిలో మూడు, ఆమన్గల్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశారని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి కేసులతో సహా మీడియా ముందు వివరించారు. వీరిపై ఆయా పోలీస్ స్టేషన్లలో 23 కేసులు నమోదయి ఉన్నాయని వివరించారు. ఇందులో ఇద్దరిని ఈనెల 14న సాంకేతిక సాక్షాదారాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ వివరించారు. రాజీవ్ శంకర్ పవర్, పవన్ మచ్చింద్ర ఇద్దరిని అదుపులోకి తీసుకొని 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 23 కేసుల్లో బాధితులకు వారికి సంబంధించిన బంగారు ఆభరణాలను కోర్టు ద్వారా అందజేస్తామని డిసిపి వివరించారు.
జాగ్రత్తగా ఉండండి..
రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల మధ్య ఈ గ్యాంగ్ ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతుందని డిసిపి నారాయణరెడ్డి మీడియాకు వివరించారు. రహదారులకు దగ్గరగా ఉన్న ఇండ్లు అదేవిధంగా తాళాలు వేసి ఉంచిన ఇండ్లను మాత్రమే ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తుందని అన్నారు. నగలు, నగదు దోచుకుపోతుందని వివరించారు. ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలను వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకోవాలని సాధారణ స్థలాలలో పెట్టకుండా ఎవరికి అర్థం కాని విధంగా వస్తువులను దాచుకోవాలని సూచించారు. అదేవిధంగా సాధ్యమైనంతవరకు విలువైన బంగారాన్ని బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఎక్కడైనా బయటికి వెళ్లాల్సి ఉంటే తమ సంబంధికులకు బంగారం వారి వద్ద ఉంచి వెళ్లాలని కోరారు. అదేవిధంగా ఎక్కువ బంగారాన్ని ధరించకూడదని సూచించారు.
కేసులో పురోగతి సాధించిన సిబ్బందికి రివార్డులు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దిశా నిర్దేశంతో డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో పోలీస్ శాఖలోని పలు విభాగాలకు చెందిన వారు మంచి పురోగతి సాధించారని డిసిపి నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. అడిషనల్ డిసిపి రామ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ డిసిపి నరసింహ, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, సిసిఎస్ ఏసిపి శశాంక్ రెడ్డి అదేవిధంగా షాద్ నగర్ ఏసిపి రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ సిఐ పవన్, సిఐ అవినాష్, డిఐ రామ్ రెడ్డి, సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో కేసును చేదించడం జరిగిందని విచారణ అధికారిగా డిఐ రాంరెడ్డి వ్యవహరించారని అదేవిధంగా కేసులో మోహన్, యాదగిరి, జాకీర్, రాజు, రఫీ తదితరులు కీలకపాత్ర పోషించారని వారికి డిసిపి నారాయణరెడ్డి చేతుల మీదుగా రివార్డులు అందజేశారు.. *