Municipal Elections: కీలక సర్క్యూలర్ జారీ చేసిన ఈసీ
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో విప్ జారీ ఉంటుందని, విప్ ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశముంది.
దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం జారీచేసింది. ఈ నెల 16వ తేదీన కలెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహించి మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన ఏ సభ్యుడైనా సదరు ఎన్నికలో ఆ పార్టీ విప్‌ను ధిక్కరిస్తే, పార్టీచే విప్‌గా నియమించబడిన వ్యక్తి, ఎన్నిక జరిగిన తేదీ నుండి 3 రోజులలోపు సభ్యుని పేరును స్పష్టంగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ద్వారా గుర్తించబడిన వ్యక్తి రాతపూర్వక నివేదికను పంపించాలి.
- పార్టీ విప్ నుండి రాతపూర్వక నివేదిక అందిన తర్వాత, కలెక్టర్ ద్వారా గుర్తించబడిన వ్యక్తి సంబంధిత సభ్యునికి ఒక షోకాజ్ నోటీసును జారీ చేసి, అతను/ఆమె పదవిలో కొనసాగడానికి ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో వివరణ ఇవ్వాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నోటీసు తేదీ నుండి 7 రోజులలోపు తన వాదనను సమర్పించాలని కోరాల్సి ఉంటుంది.
- జిల్లా కలెక్టర్ చేత గుర్తించబడిన వ్యక్తి, సంబంధిత సభ్యుడు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుని, విప్ ఆదేశాన్ని ధిక్కరించినందుకు ఆ సభ్యుని సభ్యత్వం రద్దు చేసే విషయంలో, వివరణ అందిన రెండు రోజులలోపు ఒక సవివరమైన ఉత్తర్వును జారీ చేయాలి. దీంతోపాటు సంబంధిత సభ్యుల నుండి ఏడు రోజులలోపు ఎటువంటి వివరణ అందకపోతే, జిల్లా కలెక్టర్ చేత నియమించబడిన వ్యక్తి 7 రోజుల గడువు ముగిసిన తర్వాత రెండు రోజులలోపు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఒక ఉత్తర్వును జారీ చేయాలి.
అధికారులకు శిక్షణ
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి నియమించిన అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం శిక్షణ నిర్వహించింది. మాస్టర్ ట్రైనీల ద్వారా వర్చువల్ గా నిర్వహించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
రూ.2.02కోట్లు సీజ్..
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)లో భాగంగానే రూ.2.02కోట్లను సీజ్ చేశారు. వీటిలో నగదు రూ.89.30లక్షలు ఉన్నాయి. రూ.84.89లక్షల విలువైన లిక్కర్, రూ.13.27లక్షల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ ఉన్నాయి. వీటితోపాటు రూ.14.69లక్షల విలువైన బంగారం, వెండి ఉన్నాయి. మరో రూ.78వేల విలువైన ట్యాబ్స్, ఇతర వస్తువులు ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.