స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడంలో మహిళా సంఘాల పాత్ర కీలకం
మగ్గం పని నేర్చుకొని ఆర్థికంగా ఎదగాలి.
జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గ్రామీణ యువతులు, మహిళలను నైపుణ్యవంతులైన స్వయం ఉపాధి దారులుగా, సూక్ష్మ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యూనియన్ ఆర్‌సెటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ శిక్షణను నేర్చుకొని ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు అన్నారు. బుధవారం గద్వాలలోని ఆర్ఎస్ ఈటిఐలో మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ కళలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కొత్త బ్యాచ్ ప్రారంభోత్సవానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళలు, యువతులు కేవలం నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమై విజయవంతమైన సూక్ష్మ వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం పరిశ్రమల శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, సబ్సిడీలు, పారిశ్రామిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్. శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ రాముడు, యూనియన్ ఆర్‌సెటీ డైరెక్టర్ డి.ఎం. శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.