సైబర్ బాధితులకు గద్వాల పోలీసుల అండ – రూ.1.75 లక్షలు రికవరీ: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

Mar 6, 2026 - 20:04
Mar 6, 2026 - 20:05
 0  1
సైబర్ బాధితులకు గద్వాల పోలీసుల అండ – రూ.1.75 లక్షలు రికవరీ: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

జోగుళాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి;- జిల్లాలో నమోదైన రెండు వేర్వేరు సైబర్ నేరాల కేసుల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో మొత్తం రూ.1,75,244 ను విజయవంతంగా రికవరీ చేసి వారి ఖాతాల్లో జమ చేయించామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., తెలిపారు.

కోర్టు ఆదేశాలు, పోలీస్–బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ మొత్తాన్ని తిరిగి సాధించడం బాధితులకు పెద్ద ఊరటనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

ఈ కేసుల్లో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గద్వాల్ న్యాయమూర్తి ధరావత్ ఉదయ నాయక్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అలంపూర్ న్యాయమూర్తి ఆర్.వి.ఎస్.ఎస్. మిధున్ తేజ రిఫండ్ ఆర్డర్లు జారీ చేశారు.

కేసు వివరాలు:
రాజోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చిన లోన్ ప్రకటనను నమ్మి ఫీజుల పేరుతో రూ.88,244 చెల్లించి మోసపోయాడు. మరో ఘటనలో గద్వాల్ టౌన్ పరిధిలో టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెట్టి మోసం చేశారు.

 బాధితులు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కోర్టు మరియు బ్యాంకుల సహకారంతో మొత్తం రూ.1,75,244 ను రికవర్ చేసి బాధితుల ఖాతాల్లో జమ చేయించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు సమాచారం అందిస్తే త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ రికవరీ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌చార్జ్ ఎస్సై తేజస్విని, సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, సైబర్ వారియర్లు ప్రహ్లాద్ రెడ్డి, రాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ సందర్భంగా బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State