సూర్యాపేట జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

Aug 17, 2026 - 23:49
Aug 17, 2026 - 23:50
 0  1
సూర్యాపేట జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
సూర్యాపేట జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

రైతుల నోట్లో మన్ను - ప్రభుత్వానికి ఎగవేస్తున్న పన్ను

అక్రమ మట్టి దందాను అరికట్టాలంటేనే జంకుతున్న పోలీస్, మైనింగ్, రవాణా శాఖలు

పర్మిషన్లు లేవు. పన్నుల చెల్లింపు లేదు 

రైతుకు ట్రిప్పు 100 ఇచ్చుకో
బయట ట్రిప్పుకు 6000 పుచ్చుకో
ప్రభుత్వ పన్నులకు ఎగనామం పెట్టుకో
చుట్టూ సిండికేట్ కోటరీ కట్టుకో 
అర్ధరాత్రి అక్రమ వ్యాపారం చేసుకో 

ఎవరూ రాకుండా టిప్పర్లు ఆగకుండా పహారా కాచుకో

కార్లు వేసుకొని రోడ్లపై మద్యం తాగుతూ హల్చల్ చేస్తూ హడల్ కొట్టుకో 

చట్ట ప్రకారం నడుచుకొమ్మని అడిగిన వారిపై దౌర్జన్యం చేసుకో 

ఆర్థికంగా ఎదిగిపో కోట్లకు పడగలెత్తిపో 

ఏమిటి ఇదంతా అంటే ఏపారం అంటూ ఎగతాళి చేసుకో

ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న మట్టి సిండికేట్ గాళ్లు 

మట్టి రాజా.. బలాదూర్ మహారాజా..!

 మేము చెప్పిందే సత్యం 
పలకరట అసత్యం 
అబద్ధమే అనునిత్యం
 అక్రమ మట్టి ఆగడాలే నిత్య కృత్యం 

 పెరిగింది వారిలో అహంకారపు మట్టి పైత్యం. అడ్డొస్తున్నవారికి అంతో ఇంతో భత్యం 

ప్రభుత్వానికి పన్నుల నష్టం.. అయితే ఏంటి అంతా మా ఇష్టం 

ఎస్సారెస్పి కాలువను పూడ్చుకో.. రోడ్డు వేసుకో 

రోడ్ల విధ్వంసం, రాత్రి పూట  నిద్ర భంగం  ఏమిటని అడిగిన వారిని భయభ్రాంతులకు గురి చేయటం 

రాత్రి వేళల్లో మట్టి మాఫియా జోరు...జెసిబిల హోరు..!  ప్రజల కంట కన్నీరు..!

ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి.. ఇలాగైతే ఎలాగండి...! 

రాత్రిపూటనే ఎందుకు..ఉదయం తోలవెందుకు

జిల్లా కలెక్టర్ సారు ఉక్కు పాద మోపుతారా...? మట్టి మాఫియా అంతమవుతుందా...?


సూర్యాపేట జిల్లాలో మట్టి మాఫియా రోజురోజుకు రెచ్చిపోతుంది. రాత్రికి రాత్రి యదేచ్చగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా జిల్లాలోని సుమారు 50 కి పైగా టిప్పర్లు తెల్లవార్లూ రోడ్లపై శబ్దాలు చేస్తూ హోరెత్తిస్తున్నాయి. మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సూర్యాపేట జిల్లాలోని భూములన్ని ఖాళీ అవుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయం దోచుకుంటున్న మట్టి మాఫియా ఎలాంటి పనులు కట్టకుండా, అధికారిక పర్మిషన్లు లేకుండా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మట్టి దందా కొనసాగిస్తున్నాయి.
జేసీబీల హోరుతో ప్రజల కన్నీరు పెడుతున్నారు. తెల్లవార్లు నిద్రలేక, అధిక శబ్దాలతో కంటిమీద కునుకు రాక  తెల్లం దాకా  జాగారం చేస్తున్నారు. సూర్యాపేటలో మట్టి దందాకు అడ్డే లేకుండా పోయింది.
 వేలాది ట్రిప్పులు వేస్తూ రోజుకు కోట్ల దోపిడీ కొనసాగుతుంది.
అధికారుల కళ్లు మూసుకున్నాయా? మట్టి మాఫియా కళ్లు తెరుచుకున్నాయా? అన్నది అంతు పట్టడం లేదు. అక్రమ మట్టి దందాపై చర్య తీసుకోవాల్సిన పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల వారు మిన్న కుండి పోతున్నారు. అక్రమ మట్టి దందాను ఆపాలంటేనే జంకుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్ని ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.
అనుమతులు లేకుండానే అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయంలో ఎవరిదైనా అండ ఉన్నదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
రాత్రి  మొదలయ్యే మట్టి దోపిడీ రైతు పొలం నుంచి రియల్ ఎస్టేట్, ఇతర వెంచర్లు, ప్రైవేట్  అవసరాల  వరకు మట్టి మాఫియా సాఫీగా నడుస్తుంది.
ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులు చేయడం మట్టి మాఫియా ఆగడాలుగా చెప్పుకోవచ్చు.
పర్మిట్  పేరుతో పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. గ్రామాలు, తండాలు ముంపుకు గురి అవుతూ మట్టి మాఫియా వల్లే అనేక కష్టనష్టాలు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉంది.
భూగర్భ జలాలు అడుగంటడానికి కారణం అడ్డగోలుగా పరిమితికి మించి లోతుకు తవ్వడం కూడా ఒక కారణం కావచ్చు.
అధిక లోడుతో రవాణా వలన రోడ్లు గుంతలు పడడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
పర్యావరణం నాశనం అవడమే కాకుండా మట్టి మాఫియా కాటు వలన గ్రామాలు భ్రష్టుపట్టే అవకాశం ఉంది.
పేదవాడి ఇల్లు కట్టుకోవాలంటే మట్టి ధరలు పెరిగిపోయాయి.

  కలెక్టర్ ఉక్కుపాదం మోపుతారా? మట్టి మాఫియా అంతమవుతుందా?
  టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
 కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమమే: గ్రామస్థుల హెచ్చరిక
 జిల్లాలో మట్టి దందాపై ప్రత్యేక నిఘా పెట్టాలి"
  ఇది అభివృద్ధి కాదు... దోపిడీ అధికారులారా మేలుకోండి

సూర్యాపేట జిల్లాలో మట్టి మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండా రైతులకు మాయమాటలు చెప్పి చాలా తక్కువగా ట్రిప్పుకు కనీసం లో కనీసం వంద రూపాయల చొప్పున ముట్టజెప్పి భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. వాస్తవానికి ఒక ఎక్కుతారు అంటే రెండున్నర ఎకరాలకు మూడు ఫీట్ల లోతు త్రవ్వి మట్టి తీస్తే ఒక రకంగా పన్ను, 6 ఫీట్ల వరకు లోతు మట్టి తవ్వితే మరో రకంగా పన్ను దాదాపు లక్షలలో ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. రైతు మొదటగా మైనింగ్ శాఖ వద్ద అనుమతి తెచ్చుకోవాలి. అనుమతి తెచ్చుకున్న మట్టిని అమ్ముకునే వెసులుబాటు లేదు. తన భూమిలో వెళ్లిన మట్టిని చుట్టూ కట్టలుగా ఎత్తుగా పోసుకోవాలి తప్పించి అమ్మేది లేదు. అయితే ఇక్కడ ప్రవేశించిన మట్టి మాఫియా అదే రైతు భూమి నుంచి మట్టిని అనుమతి లేకుండా తాము ఎంత త్రవ్వాలో అంత తవ్వుకొని బయట ట్రిప్పుకు 4500 నుంచి 6000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు చెప్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం కొల్లగొట్టడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు.
రాత్రి అయితే చాలు జేసీబీల శబ్దం, టిప్పర్ల రద్దీ తో  పొలాలు బీటలు వారాయి, బోర్లు ఎండిపోయాయి, రోడ్లు విధ్వంసం అయ్యాయి అని అని సూర్యాపేట జిల్లా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ దందా విషయమై సమాచారం అందుకుని వెళ్లిన మీడియా వారిని సైతం మట్టి మాఫియా భయభ్రాంతులకు గురి చేయడం విచారకరం. మరొక ట్విస్ట్ ఏమిటంటే సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణంలో ఒక్కో టిప్పర్ మట్టి 14 వేల రూపాయలకు అమ్మినట్టు టిప్పర్ యజమానులే పేర్కొనడం గమనించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రజాధనాన్ని సొంతంగ మెక్కడమే కాకుండా కలెక్టర్ కార్యాలయానికి మట్టి తోలుతున్నాం అనే పేరు మీద సంవత్సరాల తరబడి ఎలాంటి తనిఖీలు లేకుండా సొంతంగా మట్టి మాఫియా వ్యాపారం నడవడం ఆశ్చర్యకరమైన నగ్న సత్యం. ఈ విషయంలో యంగ్ అండ్ డైనమిక్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కఠిన చర్యలు తీసుకొని మట్టి మాఫియా ను అరికట్టాలని సూర్యాపేట జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333