సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ
హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్టు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్ పోలీసులు స్వీకరించారు. రాజ్‌తరుణ్‌పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. తగిన ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు వెల్లడించారు.